అంతా నియంతృత్వమే

Everything is dictatorship– ప్రతిపక్షాలు, పౌర సమాజం లక్ష్యంగా దాడులు
– కేజ్రీవాల్‌ అరెస్టు నుంచి కాంగ్రెస్‌ ఖాతాల స్తంభన వరకు ఇదే తీరు
– ఇటీవల యూఎస్‌ వ్యాఖ్యలనూ బీజేపీ రాజకీయంగా వాడుకునే అవకాశం
– మేధావులు, రాజకీయ నిపుణులు, విశ్లేషకుల ఆందోళన
న్యూఢిల్లీ : మోడీ పదేండ్ల పాలనలో ప్రజాస్వామ్యం చాలా దారుణంగా దిగజారిపోయిందనీ, ప్రతిపక్షాలు, పౌర సమాజమే లక్ష్యంగా దాడులకు పాల్పడుతూ నియంతృత్వంగా వ్యవహరించిందని మేధావులు, రాజకీయ నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌, కాంగ్రెస్‌ ఖాతాల ఫ్రీజ్‌, వాటిపై యూఎస్‌, జర్మనీల స్పందన వంటి తాజా అంశాలనూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా వాడుకుంటుందో అన్నదానిని కూడా వారు అంచనా వేశారు.
యూఎస్‌ వ్యాఖ్యలపై బీజేపీ స్పందన
కేజ్రీవాల్‌ అరెస్టు అనంతరం అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్స్‌ చేసిన వ్యాఖ్యను ”భారత న్యాయవ్యవస్థపై దూషణ”గా బీజేపీ అభివర్ణించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్‌ అరెస్ట్‌, కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడాన్ని నిశితంగా గమనిస్తున్నామని అమెరికా తెలిపింది. యూఎస్‌ న్యాయమైన, పారదర్శకమైన, సమయానుకూల చట్టపరమైన ప్రక్రియలను ప్రోత్సహిస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. భారతదేశ అత్యంత విశ్వసనీయమైన వ్యూహాత్మక భాగస్వామి నుంచి వచ్చిన ఈ ప్రకటన బీజేపీ ఊహించి ఉండకపోవచ్చనీ, ఆ పార్టీ వాదిస్తున్నట్టుగా న్యాయవ్యవస్థపై ఎలాంటి దూషణగానూ చూడరాదని విదేశాంగ న్యాయ నిపుణులు అంటున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్నీ బీజేపీ ఒక ప్రచారంగా వాడుకునే అవకాశమున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
‘న్యాయ వ్యవస్థ భుజాలపై నుంచి కాల్పులు జరిపే యత్నం’
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేపథ్యంలో కేజ్రీవాల్‌ అరెస్టు జరగటం, ఈ కేసులో న్యాయమైన, సమయానుకూలమైన చట్టపరమైన ప్రక్రియ జరగాలని కోరుకుంటున్నట్టు యూఎస్‌ నుంచి ప్రకటన రావటం జరిగిన విషయం విదితమే. ”సమయానుకూలమైన, న్యాయమైన చట్టపరమైన ప్రక్రియను నిర్ధారించడం,చట్టం అమలు, కేసుల విచారణను పర్యవేక్షించే మోడీ పాలన యొక్క బాధ్యత. కంచె పంటలను తినడం ప్రారంభిస్తే, ఇప్పుడు జరుగుతున్నట్టుగా అప్పుడు న్యాయవ్యవస్థ పెద్దగా ఏమీ చేయదు. ఇక్కడ న్యాయ వ్యవస్థకు పెద్ద పరీక్ష” అని ప్రస్తుత మోడీ పాలన పరిస్థితులను గమనిస్తున్న మేధావులు కొందరు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో విపక్షాలపై కేంద్ర సంస్థలను పంపటం ద్వారా న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసిన కాషాయపార్టీ.. న్యాయవ్యవస్థ భుజాలపై నుంచి కాల్పులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తున్నారు.
 పాలనలో నిరంకుశత్వం
తాజా ఆర్డినెన్స్‌లు, చట్టం ద్వారా సుప్రీంకోర్టును ఎవరు బలహీనపరుస్తున్నారో మనందరికీ తెలుసని చెప్తున్నారు. ” పదేండ్లుగా మోడీ పాలనకు సారథ్యం వహిస్తున్నారు. అతను అత్యంత నిరంకుశ ప్రభుత్వాన్ని నడిపాడు. ఆయన ప్రభుత్వం ప్రతిపక్షం, పౌర సమాజంపై కనికరంలేని దాడిని సాగించింది. ఇలాంటి పాలనలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని గొంతె త్తటం, ఐక్యం కావటం కాస్త గొప్ప విషయమే” అని మేధావులు, రాజకీయ విశ్లేషకులు, నిపుణులు
అంటున్నారు.
 ‘కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో ఎన్నికలు, ప్రజాస్వామ్యంపై ప్రభావం’
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్రూవర్‌గా మారిన కొందరు నిందితుల వాంగ్మూలాలు మినహా వ్యక్తిగత మనీ ట్రయల్‌ ఏదీ ఇంకా జరగలేదు. మద్యం కుంభకోణంలో భాగమని ఆరోపించబడిన ఒక వ్యాపార వేత్త బెయిల్‌ పొందిన తర్వాత అప్రూవర్‌గా మారారు. ఇప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఏపీలోని బీజేపీ- టీడీపీ కూటమికి అభ్యర్థిగా మారారు. కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదిస్తున్నారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయం, విధానం మన ప్రజాస్వామ్యం, నిష్పక్షపాతమైన ఎన్నికలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందనీ, ఫలితంగా ఇవి రాజ్యాంగం ప్రాథమిక  నిర్మాణాన్ని ఉల్లంఘిస్తున్నాయని సింఘ్వీ ఆరోపించారు.
కాంగ్రెస్‌పై ‘ఐ’టీ
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాను స్తంభింపజేయడం కూడా ప్రజాస్వామ్యంపై అదే ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మేధావులు, న్యాయ నిపుణులు అంటున్నారు. 24 మంది కాంగ్రెస్‌ సభ్యులు రూ. 14 లక్షల నగదు డిపాజిట్‌ను ఉల్లంఘించినందుకు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ మొదట కాంగ్రెస్‌ పార్టీకి నోటీసు ఇవ్వటం ప్రారంభించింది. సాధారణ పన్ను విషయంలో, పన్ను డిమాండ్‌ రూ. 14 లక్షలు, గరిష్టంగా 300 శాతం జరిమానా విధించబడుతుంది. తర్వాత కేసు క్లోజ్‌ అవుతుంది. కానీ ఈ సందర్భంలో, గరిష్ట పెనాల్టీని చెల్లించాలని కాంగ్రెస్‌ నివేదించినప్పుడు.. ఐటీ శాఖ ఈ విషయాన్ని పరిష్కరించటానికి నిరాకరించటం గమనార్హం.
‘అసలు సమస్య ప్రజలకు బాగా తెలుసు’
మన ప్రజాస్వామ్య ఆరోగ్యానికి తీవ్ర ఆందోళన కలిగించే ఈ చర్యలన్నీ కార్యనిర్వాహక వర్గం నుంచి వెలువడుతున్నాయని మేధావులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ” వారితో న్యాయవ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదు. న్యాయవ్యవస్థను కొన్ని శక్తులు దెబ్బతీస్తున్నాయని 600 మంది న్యాయవాదులు సంతకం చేసిన పిటిషన్‌కు హరీష్‌ సాల్వే నాయకత్వం వహించటం చాలా గొప్ప విషయం.అసలు సమస్య ఎక్కడ ఉందో ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని, పౌర సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవటంలో న్యాయవ్యవస్థ భుజాల నుంచి కాల్పులు జరపకపోతే మంచిది. అన్ని వర్గాల్లో అవగాహన వచ్చినా.. భారత్‌లో ప్రజాస్వామ్యం ఇంకా ప్రమాదంలో ఉన్నది” అని వారు అంటున్నారు.