– నోటీసు ఇవ్వరు…కారణం చెప్పరు
– డిజిటల్ న్యూస్‌పై మోడీ సర్కారు ఉక్కుపాదం
– ప్రభుత్వ వ్యతిరేక కథనాలపై ఆంక్షలు
– ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్వతంత్ర జర్నలిస్టులు
న్యూఢిల్లీ : నోటీసులు ఇవ్వరు… హెచ్చరికలు జారీ చేయరు… నిబంధ నలు పాటించరు… ఐటీ చట్టంలో చేర్చిన నూతన నిబంధనలను సాకుగా చూపుతూ సామాజిక మాధ్యమాలలో కన్పించే డిజిటల్ వార్తలపై మోడీ ప్రభుత్వం అనుస రిస్తున్న కక్షపూరిత వైఖరి ఇది. ఆ వార్తలు, కథనాలు ప్రజలకు చేర కుండా సర్కారు ఉక్కుపాదం మోపు తోంది. నిషేధం విధిస్తోంది. ఆయా ఛానల్స్ యాజమాన్యాలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎలాంటి కారణం చూపకుండానే తమ వార్తలు, కథనాలను నిలిపివేస్తున్నారని ఫేస్‌బుక్ నుండి యూట్యూబ్ వరకూ డిజిటల్ పాత్రికేయులు గగ్గోలు పెడుతున్నారు. అయినా వారి గోడు అరణ్యరోదనే అవుతోంది.
ఇది ‘బోల్టా హిందుస్థాన్’ కథ
ఢిల్లీకి చెందిన వార్తా ఛానల్ ‘బోల్టా హిందుస్థాన్’కు యూట్యూబ్ నుండి ఈ నెల 3వ తేదీన ఓ ఈ-మెయిల్ వచ్చింది. ఛానల్ ప్రసారాలు నిలిపివేయాలంటూ తమకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుండి నోటీసు అందిందని అందులో తెలియ జేశారు. అయితే ఇది స్పామ్ మెస్సేజ్ అయి ఉంటుందని భావించిన బోల్టా హిందుస్థాన్ ఛానల్ దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ-మెయిల్ అందిన 12 గంటల తర్వాత… మూడు లక్షల మంది వినియోగ దారు లున్న ఈ యూట్యూబ్ ఛానల్ అదృశ్యమై పోయింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ ఛానల్ యాజమాన్యం మరోసారి ఇ-మెయిల్‌ను సంప్రదించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల్లోని (ఐటీ చట్టంలోని సెక్షన్ 69-ఏతో కలిపి) రూల్ 15 (2) ప్రకారం నోటీసు జారీ చేసినట్లు అందులో తెలిపారు. అయితే ఛానల్ న్యూస్‌రూమ్‌పై ఎందుకు ఈ చర్య తీసుకున్నదీ తెలియరాలేదు. ప్రభుత్వ నోటీసును గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉన్నదని, కాబట్టి దానిని ఛానల్‌తో పంచుకోలేకపోతు న్నామని యూట్యూబ్ ఈ-మెయిల్ వివరించింది. ఎలాంటి కారణం తెలియజేయకుండా ఇలాంటి ఆదేశాలు ఎలా జారీ చేస్తారని బోల్టా హిందుస్థాన్ ఛానల్ సంపాదకుడు సమర్ రాజ్ ప్రశ్నించారు. ‘నోటీసు ఇవ్వరు. హెచ్చరికలు జారీ చేయరు. కారణం చెప్పరు. ఓ ప్రక్రియను పాటించరు. అసలు వారి సమస్య ఏమిటో తెలుసుకోలేకపోతున్నాము’ అని అన్నారు.
ఈ వేదికలపై కూడా…
డిజిటల్ న్యూస్‌పై మోడీ సర్కారు ఉక్కుపాదం మోపడం ఇదేమీ మొదటిసారి కాదు. బోల్టా హిందుస్థాన్‌కు ఈ-మెయిల్ వచ్చిన రోజే మరో డిజిటల్ సంస్థ ‘నేషనల్ దాస్‌టాక్’ కూడా యూట్యూబ్ నుండి ఇదే తరహా సందేశం అందుకుంది. ఈ ఛానల్‌కు 94 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ఫిబ్రవరిలో ‘ఆర్టికల్19 ఇండియా’ అనే డిజిటల్ సంస్థకు మేటా నుండి ఇదే రకమైన ఈ-మెయిల్ వచ్చింది. ఈ సంస్థ ఫేస్‌బుక్ పేజీపై ఆంక్షలు విధించినట్లు అందులో తెలియజేశారు. గత నెలలో యూట్యూబ్ మన దేశంలో రెండు వీడియోలను బ్లాక్ చేసింది. వీటిని ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఏబీసీ) రూపొందించింది. ఇవి సిక్కు వేర్పాటువాది హత్యకు సంబంధించినవి. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుండి తనకు ఆదేశాలు అందాయని, అయితే వాటిని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉన్నదని ఏబీసీకి మేటా తెలిపింది. మంత్రిత్వ శాఖ పంపిన నోటీసును తనతో పంచుకునేందుకు యూట్యూబ్ నిరాకరించిందని నేషనల్ దాస్‌టాక్ వ్యవస్థాపకుడు శంభు కుమార్ సింగ్ చెప్పారు. దానికి కారణం గోప్యతే. సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ‘బహుశా మేము బహుజనులు, రైతులపై కథనాలు ఇస్తున్నందుకు ఇలా చేసి ఉండవచ్చు. కుల వ్యవస్థను మేము వ్యతిరేకిస్తున్నాము. రాజ్యాంగ హక్కులపై వార్తలు అందిస్తున్నాము. అదే మా తప్పు అయి ఉండవచ్చు. వాళ్లు కనీసం కారణం కూడా చెప్పడం లేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి?’ అని ఆయన వాపోయారు.
నోటిఫికేషన్లు పోవు…ఆదాయం రాదు
ఇప్పుడు మళ్లీ ‘ఆర్టికల్19 ఇండియా’ ఫేస్‌బుక్ పేజీ విషయానికి వద్దాం. ప్రభుత్వం ఇచ్చిన నోటీసుపై సంవత్సరం తర్వాతే అప్పీలు చేసుకోవాలని ఫేస్‌బుక్ నుండి వచ్చిన ఈ-మెయిల్‌లో స్పష్టం చేశారని ఆ పేజీ వ్యవస్థాపకుడు నవీన్ కుమార్ చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు, కథనాలు రాకూడదన్నదే వారి ఉద్దేశంగా కన్పిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అసలు తమపై ఫిర్యాదు చేసింది ఎవరో కూడా తెలియడం లేదని అన్నారు. ప్రభుత్వ చర్య కుమార్‌ను చాలా ఇబ్బంది పెడుతోంది.
ఫేస్‌బుక్‌లో కొత్త కథనాన్ని అప్‌లోడ్ చేస్తుంటే ఆయన పోర్టల్‌ను చూసే వారికి నోటిఫికేషన్లు పోవడం లేదు. అంతేకాదు…అప్‌లోడ్ చేసిన వీడియోల ద్వారా ఆయనకు ఎలాంటి డబ్బు అందడం లేదు. గత మూడు నెలల్లో తాను అప్‌లోడ్ చేసిన అనేక వీడియోలకు ఒక్క రూపాయి కూడా రాలేదని కుమార్ చెప్పారు. ‘నేను టీవీ రంగంలో ఇరవై సంవత్సరాలు పనిచేశాను. టీవీ మీడియాలో పరిస్థితులు నచ్చక ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడి నుండి మేము ఎక్కడికి పోవాలి?’ అని ఆవేదనతో ప్రశ్నించారు.
ఒత్తిడి తెస్తూ… ఐటీ చట్టంలో తీసుకొచ్చిన నిబంధనలు
సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్‌బుక్, యూట్యూబ్‌కు విశేషాధికారాలు కట్టబెట్టాయి. ఏ సమాచారాన్నయినా తొలగించే లేదా సవరించే లేదా నిషేధించే అధికారాలు వాటికి సంక్రమించాయి. ఈ చట్ట నిబంధనలనే ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంటూ సామాజిక మాధ్యమాలపై ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలు, కథనాలు, వీడియోలను తొలగించేలా చేస్తోంది.
ఈసీ దృష్టికి వెళ్లినా…
యూట్యూబ్ ఛానల్స్‌పై నిషేధం విధిస్తున్న విషయాన్ని ఈ నెల 8న కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసికెళ్లారు. ఎన్నికల సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడే అధికారం ప్రభుత్వానికి లేదని ఆయన గుర్తు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 69, సెక్షన్ 79లను యూట్యూబ్ ఛానల్స్‌పై ప్రయోగించకూడదని ఎన్నికల కమిషన్ కూడా అభిప్రాయపడింది. ఎన్నికల సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను నిలువరించకూడదని తెలిపింది. అయినప్పటికీ డిజిటల్ న్యూస్‌పై ఆంక్షలు ఆగడం లేదు. కాగా ప్రభుత్వ ఒత్తిడులకు లొంగేది లేదని, ప్రజలను చేరుకోవడానికి మరో ఛానల్‌ను ప్రారంభిస్తామని లేదా ఇతర మీడియా వేదికలను ఉపయోగించుకుంటామని నిషేధానికి గురైన వేదికలు స్పష్టం చేశాయి.
అందరిదీ ఇదే గోస
ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న పలువురు స్వతంత్ర డిజిటల్ జర్నలిస్టులది కూడా ఇదే పరిస్థితి. తనకు ఒక్క రూపాయి కూడా ఆదాయం లభించకుండా మూడు నెలలు ఆంక్షలు విధించారని అంజుమ్ తెలిపారు. మంత్రిత్వ శాఖ నిర్ణయంపై అప్పీలు చేసినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. గత ఆరు నెలలుగా ప్రజలకు చేరువ కావడం కూడా కష్టమవుతోందని, ఓ సంవత్సరం క్రితం తన వీడియోలను లక్షలాది మంది చూసేవారని, ఇప్పుడు వేల సంఖ్యలో చూడడం కూడా కష్టమవుతోందని ఆయన తెలిపారు. గత నవంబర్ నుండి తనది కూడా ఇదే పరిస్థితి అని స్వతంత్ర పాత్రికేయుడు సాక్షి జోషి చెప్పుకొచ్చారు. తన సంస్థ ‘గాన్ సవేరా’కు చెందిన సోషల్ మీడియా ఖాతాలను 2023 ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలో నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ జర్నలిస్ట్ మన్‌దీప్ పునియా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి, యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమ వేదికలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మరునాడు ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారని, అయితే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో మాత్రం సెన్సార్‌షిప్ కొనసాగుతోందని పునియా తెలిపారు. ప్రచురించిన ఓ కథనాన్ని 24 గంటల్లోగా తొలగించాలంటూ ‘ది కారవాన్’ పత్రికకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఫిబ్రవరిలో ఐటీ చట్టంలోని సెక్షన్ 69-ఏ కింద నోటీసు ఇచ్చింది. దీనిని ఆ పత్రిక ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది.