– 1500 మంది పోలీసుల భారీ బందోబస్తు
– పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
– వదంతులు సృష్టిస్తే చర్యలు : హైదరాబాద్ నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో/ బేగంపేట్
సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయినీ బోనాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఉత్సవాలను ప్రశాంత వాతావారణంలో నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆది, సోమ రెండ్రోజులు జరిగే ఉత్సవాల్లో మంత్రులు, వీఐపీలు, వీవీఐపీలు, ప్రముఖులు పాల్గొననున్న నేపథ్యంలో 1500 మందితో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచించారు. బోనాల నేపథ్యంలో పోలీసులు షీ బృందాలను, యాంటీ చైన్‌స్నాచింగ్ బృందాలను రంగంలోకి దించారు.
సికింద్రాబాద్‌లోని ఆలయంలో 24 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు, వివిధ ప్రాంతాల్లో అదనంగా మరో 400కుపైగా సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని ఎప్పటికప్పుడూ బంజారాహిల్స్‌లో సీసీసీలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తోపాటు మహంకాళి ఠాణాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జాయింట్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పర్యవేక్షిస్తారు. అలాగే పలు ప్రాతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు అదనపు పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మహంకాళీ దేవాలయం పరిసరాలతోపాటు జనరల్ బజార్, సుభాష్ రోడ్ మార్గాలను మూసేస్తారు. ఎంజీ రోడ్, సింధికాలనీ, మినిస్టర్ రోడ్, ప్యాట్నీ తదిర ప్రాంతాల్లో 21, 22 తేదీల్లో ఈ మార్గాలో వాహనాల దారి మళ్లింపు ఉంటుందన్నారు. సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొనే వాహనదారుల కోసం ప్రత్యేకంగా 9 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని, పోలీసులు సూచించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పార్క్ చేయాలని కోరారు.