వనదేవతల జాతరకు సర్వం సిద్దం..

– దేవక్కపల్లిలో ప్రసిద్ధిగాంచిన సమ్మక్క-సారలమ్మ జాతర 

– రేపటి నుండి 25 వరకు జాతర మహోత్సవాలు
– భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ – భువనగిరి
రెండేండ్లకొకమారు అదివాసీ,గిరిజన సంప్రదాయంలో నిర్వహించే వనదేవతలు సమ్మక్క సారలమ్మ జాతరకు మండలంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.జాతర మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా సకల సౌకర్యాలను జాతర కమిటీ సభ్యులు ఏర్పాటుచేశారు. దేవక్కపల్లి గ్రామంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర మండలంలో అత్యంత ప్రసిద్ధిగాంచింది.రేపటి నుండి 25 వరకు నిర్వహించనున్న జాతర మహోత్సవానికి అయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హజరై మొక్కలు చెల్లించుకుంటారు.మోయతుమ్మెద వాగు పరిసర ప్రాంతంలో నిర్వహించనున్న ఈ జాతరకు భక్తులకు త్రాగునీరు,ప్రత్యేక స్నానఘట్టాలు ఏర్పాటుచేసి జాతర జరిగే స్థలాన్ని నిర్వహణ కమిటీ సభ్యులు చదును చేయించారు. రాజీవ్ రహదారి ప్రక్కనే దేవక్కపల్లి గ్రామం ఉండడంతో భక్తులకు రవాణ సౌకర్యం అందుబాటులో ఉంది.
జాతర మహోత్సవం ఇలా: 21న మద్యహ్నం ఊరి నుండి భక్తులకు వరాలిచ్చే వరాల కుండా,లక్ష్మి దేవి కుండా,ఏడాంత్రాల బోనం గ్రామంలోని శివమెత్తిన భక్తుల పూనకాలతో డప్పు చప్పుల్లతో ఊరేగింపుగా భయలుదేరి సాయంత్రం వరకు సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద ప్రతిష్టిస్తారు.రాత్రి సమయంలో కంకవనం పూజరుల వేదామంత్రాలతో గద్దెల వద్దకు చేరుకుంటుంది.రాత్రి సమయంలో సారలమ్మను గ్రామ శివారులోన బందం చిలుకల గట్టు నుండి గద్దెపైకి తీసుకువస్తారు.అదే రోజు పడిగిద్దె రాజును,గోవింద రాజును గద్దెలపైకి పూజారులు తీసుకువస్తారు.గురువారం 22న ఉదయం సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. వనదేవతలు గద్దెలపై కొలువుదీరడంతో భక్తుల మొక్కులు చెల్లింపులు ప్రారంభమవుతాయి.25న అదివారం సమ్మక్క, సారలమ్మ,పడిగిద్దె రాజు,గోవింద రాజు మళ్లీ వనప్రవేశం చేస్తారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం : దేవక్కపల్లి గ్రామంలో నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవాలకు జాతర నిర్వహణ కమిటీ అధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశాం.త్రాగునీరు,స్నాన ఘట్టాలు,దర్శనానికి భారీకేడ్లు,వైద్యం,రవాణ సౌకర్యాలను భక్తులకు కల్పించాం.భక్తులు పెద్ద సంఖ్యలో హజరై మొక్కులు చెల్లించుకోవడానికి సకల సౌకర్యాలు సమకూర్చాం.
-జంగిడి సంజీవ రెడ్డి,జాతర కమిటీ చైర్మన్ దేవక్కపల్లి.