అంతా మీ ఇష్టమేనా..ముఖ్యఅతిథి ఎవరో తెలియదా?

– జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రోటోకాల్‌ రగడ
– ఎమ్మెల్యేను ముఖ్య అతిథిగా పిలవడంపై ఆగ్రహం
– డీఈఓపై జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి మండిపాటు
– చివరకు జడ్పీ చైర్మన్‌ను ముఖ్య అతిథిగా సంబోధించిన వైనం
– అలిగిన ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్‌
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
‘ఎవరు ముఖ్య అతిథి? సభకు ఎవరు అధ్యక్షులు? అన్న విషయం తెలియదా.. అంతా మీ ఇష్టమేనా..? ప్రభుత్వం మారితే ప్రోటోకాల్‌ మారుతుందా. ఇదేం పద్ధతి. అధికారులు ఇలా వ్యవహరిస్తే ఎలా? జిల్లా విద్యాధికారి ఏం చేస్తున్నారు. ఎవరు ఏంటో కూడా తెలియనిపరిస్థితిలో ఉన్నారా. ఇది సరైన కాదు.. పద్ధతి మారాలి’ అంటూ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ తీగల అనిత రెడ్డి విద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్‌ తప్పడం పట్ల మండిపడ్డారు. మరోవైపు ఫోటో కాల్‌ ప్రకారం వేదికపైకి పిలకపోవడాన్ని ఎంపీపీ కృపేష్‌ తప్పుపట్టారు. వేదికపైకి వెళ్లకుండా కిందనే కూర్చుండి పోయారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలోని గురుకుల విద్యాపీఠలో జరుగుతున్న జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో చోటు చేసుకున్నది. అందుకు సంబంధించిన వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌ బాబు ప్రారంభించాల్సి ఉంది. విశిష్ట అతిథులుగా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హాజరు కానున్నారు. అనివార్య కారణాల రీత్యా మంత్రి హాజరు కాలేదు. ముగింపు సమావేశాలకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో హాజరైన జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ముఖ్యఅతిథిగా సభలను ప్రారంభించాల్సి ఉంది. ఈ సభలకు జెడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి హాజరయ్యారు. అయితే విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కళారూపాల అనంతరం జిల్లా విద్యాధికారులు అతిధులను వేదికపై ఆహ్వానించారు. ఈ తరుణంలో ముందుగా స్థానిక ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డిని ముఖ్య అతిథులుగా ప్రకటిస్తూ వేదిక పైకి ఆహ్వానించారు. ఆ తర్వాత జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గీతల అనితారెడ్డిని వేదిక మీదకు ఆహ్వానించారు. దీంతో వేదిక పైకి వెళ్లిన జడ్పీ చైర్‌ పర్సన్‌ అనితారెడ్డి విద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ”ప్రోటోకాల్‌ ప్రకారం ఈ సభలకు ఎవరు ముఖ్యఅతిథి? ఎవరు వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించాల్సి ఉంది. నిర్వాహకులు ఏమని సంబోధిస్తున్నారు. అంతా మీ ఇష్టమేనా” అంటూ విద్యాధికారులపై మండిపడ్డారు. జిల్లా విద్యాధికారి ఎక్కడ అంటూ నిలదీశారు. వేదికపైకి పిలిచే క్రమంలో సంభోదించాల్సిన అంశాలపై కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముందని గుర్తు చేశారు. ప్రభుత్వాలు మారితే ప్రోటోకాల్‌ మారుతుందా అని నిలదీశారు. రంగారెడ్డి జిల్లాలో గతంలో ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేసిన అనుభవం కలిగిన జిల్లా విద్యాధికారులు ఎందుకు ప్రోటోకాల్‌ తప్పుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వాలు మారిన తర్వాత ఎందుకు ఇలాంటి తప్పులకు ఆస్కారం ఇస్తున్నారని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక మండల పరిషత్‌ అధ్యక్షులు కృపేష్‌ సైతం ప్రోటోకాల్‌ విషయంపై అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీపీనే కాకుండా మండల విద్యా కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న తనకు సైతం వేదిక మీదకి ఆహ్వానిస్తున్న క్రమంలో విద్యాధికారులు అవలంభించిన విధానం సరికాదని నిరసన వ్యక్తం చేశారు. వేదికపైకి వెళ్లకుండా వేదిక కిందనే ఆశీనులయ్యారు. మండల స్థాయి విద్యాధికారులు వచ్చి ఆయన సముదాయించే ప్రయత్నం చేసిన వినిపించుకోలేదు. జ్యోతి ప్రజ్వలన చేసేంత వరకు వేదిక కిందనే కూర్చున్న ఎంపీపీ కృపేష్‌ అనంతరం మరోసారి విద్యాధికారుల విజ్ఞప్తి మేరకు వేదికపైకి వెళ్లారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతున్న క్రమంలోనూ ప్రొటోకాల్‌ విషయాలను గుర్తు చేస్తూ అధికారులకు చురకలంటించారు. దాంతో జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన సందర్భంగా ఫోటో కాల్‌ రగడ మరోసారి తెరమీదకి వచ్చింది.మీడియా గ్యాలరీని ఆక్రమించిన కాంగ్రెస్‌ శ్రేణులుజిల్లా వైజ్ఞానిక ప్రదర్శన సందర్భంగా విద్యా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులు, అతిథలతో పాటు ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు వేరువేరు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అందుకు బోర్డులు కూడా పెట్టారు. అయితే మీడియా కోసం ఏర్పాటు చేసిన పాత్రికేయుల గ్యాలరీని కాంగ్రెస్‌ నాయకులు ఆక్రమించుకుని ఆసీనులయ్యారు. పాత్రికేయులు మాత్రం నిలుచునే తమ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాత్రికేయుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీకి మాత్రం పాత్రికేయ గ్యాలరీగా బోర్డు ఉంది. దాంతో ఒకరిద్దరు పాత్రికేయులు చేసుకొని మీడియా కోసం ఏర్పాటు చేసిన పాత్రికేయ బోర్డును తొలగించాలని తమకు కేటాయించిన సీట్లు తమకు ఇవ్వకుండా పాత్రికేయుల గ్యాలరీ అని బోర్డు పెట్టడం సరికాదని, ఆ బోర్డును తొలగించాలని పాత్రికేయులు పట్టుబట్టారు. చివరకు పాత్రికేయుల బోర్డును తొలగించారే తప్ప ఆ గ్యాలరీలో కూర్చున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులను మాత్రం కదపలేకపోయారు. ఈ విషయమై డీపీఆర్‌ఓ దష్టికి తీసుకుపోయిన పట్టించుకోలేదు.