మేకపిల్లను తినదలచుకున్న తోడేలు ఏం చేసింది అన్న కథ తెలిసిందే. తోడేలుకు తర్కంతో పని లేదు, నీళ్లు మురికి చేసిందన్న మేకపిల్ల కాలువ చివరన ఉందన్న వాస్తవంతో నిమిత్తం లేదు. గత మూడేండ్లుగా వేటాడుతున్నప్పటికీ ఒక్క కారణం కూడా దొరకక పోవటంతో చివరకు నిరం కుశ అధికారంతో న్యూస్‌క్లిక్ సంస్థ మీద ఉగ్రవాద ముద్రవేసి అణచివేతకు పూనుకుంది, అంతే! ప్రభుత్వం, దాన్ని తెర వెనుక నుంచి ఆడించే సంఘ పరివార్ సంస్థల భావ జాలం, కుట్రలు, దుండగాల గురించి జనాన్ని చైతన్యం చేస్తున్న మీడియా సంస్థల సంగతి చూడాలని ఎప్పుడో నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వ దురంతాన్ని చూసి దేశంలోని యావత్ జర్నలిస్టులు నివ్వెర పోతున్నారు. తాము పని చేస్తున్న ఏ సంస్థ అయినా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాస్తే లేదా టీవీల్లో చూపితే తమకూ ఇదే గతి పడు తుందా అని భయపడుతు న్నారు. న్యూస్‌క్లిక్ మీద దాడి ద్వారా సంఘ పరివార్ పెద్దలు తమ మీద రాసే విమర్శనాత్మక మీడియా సంస్థలకు వాటిలో పని చేసే జర్నలిస్టులకూ పంపదలచిన సందేశమదే. బహుశా ప్రపంచంలో ఏ మీడియా కంపెనీ మీదా ఇంత దుర్మార్గానికి ఏ ప్రభుత్వమూ పాల్పడి ఉండదు. ఏవైనా అక్రమాలు జరిగితే సంస్థ యజమా నులు, కీలకమైన బాధ్యతల్లో ఉన్న వేళ్ల మీద లెక్కించదగిన ముఖ్యుల మీద కేసులు మామూలే. కానీ వందల మంది ఢిల్లీ పోలీ సులు ఒక్కసారిగా తెగబడి వంద ఇళ్ల మీద దాడులు చేసి యాభై మందిని నిర్బంధిం చటం స్వతంత్ర భారత చరిత్రలో ఇంత వరకు జరిగి ఉండదు. దాడులకు గురైన ఇండ్లలో జర్నలిస్టులు, మాజీ సిబ్బంది, సంస్థ కోసం పని చేసే కాంట్రాక్టర్లవి ఉన్నాయి.
న్యూస్‌క్లిక్ చైనా నుంచి నిధులు పొంది దేశవ్యతిరేక రాతలు రాస్తు న్నదన్న ఆరోపణకు ఒక్కటంటే ఒక్క ఆధారం లేదు. ఫలానా తేదీ, ఫలాన విశ్లేషణ అలా ఉంది అనేందుకు ఒక్క ఉదాహరణ కూడా లేదు. గాలిపోగేసి జరుపుతున్న ప్రచారదాడి, ఆ సాకుతో అణచివేతకు ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఆర్థికరపరమైన అవకతవకలేమీ దొరక్క చివరకు ఉగ్రవాద ముద్రవేశారు. భీమా కొరెగావ్ కేసులో నిందితుల కంప్యూటర్లలో పోలీసు ఏజంట్లు కట్టుకథల సమాచారాన్ని చేర్చి దాన్నే సాక్ష్యాలుగా చూపిన దుర్మార్గం తెలిసిందే. ఇప్పుడు న్యూస్‌క్లిక్ కార్యాలయం, సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో అదే పునరావృతం అయినా ఆశ్చర్యం లేదు. చైనా నిధుల గురించి నిర్ధిష్టమైన సమాచారం ఉంటే అక్కడి ప్రభుత్వానికి రాసి వివరాలు తెలుసుకోవచ్చు. చైనాతో సంబంధా లున్నట్లు వచ్చిన వార్తలను చూశామని వాటి ప్రామాణికత మీద మాట్లాడ లేమని అమెరికా వ్యాఖ్యానించింది. నిజానికి ఈ కుట్రలో అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ కూడా తన పాత్ర పోషించింది. అమెరికా ప్రభుత్వం అదే నాటకం ఆడుతున్నది.
తమ అవినీతి, విధానాల మీద రాసినందుకు బ్రిటీష్ పాలకులు 1807లోనే బెంగాల్ గజెట్ పత్రికను తొలిసారిగా మూసివేశారు. తరువాత అనేక పత్రికల ముద్రణా యంత్రాలు, కార్యాలయాలను స్వాధీనం చేసుకున్న చరిత్ర తెలిసిందే.1910లో తెచ్చిన చట్టంతో వెయ్యికి పైగా పత్రికలను మూసివేశారు. ఎందరో జర్నలిస్టులు మీద, పని చేస్తున్న పత్రికల మీద దేశద్రోహ నేరాలు మోపి కేసులు పెట్టారు, జైలుపాలు చేశారు. హితవాద పత్రికలో ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు రాసిన జర్నలిస్టు పేరు చెప్పాలని వేధించింది, హిందూస్థాన్ టైమ్స్ పత్రిక కార్యాలయాల మీద దాడులు చేసింది. న్యూస్‌క్లిక్ మీద దాడులు చేసిన తీరు నాటి ఉదంతాలను కళ్ల ముందుంచింది. తెల్ల వారి పాలనలో ఎంత నిర్బంధం పెరిగితే అంతగా కొత్త పత్రి కలు రంగంలోకి వచ్చాయి. ఐదేళ్ల జైలు, అధికారిక రహస్యాల వెల్లడినేర చట్టం పేరుతో చివరికి మరణశిక్ష విధించేందుకు పూనుకుంది. రౌలట్ చట్టం ద్వారా ఎలాంటి విచారణ లేకుం డానే నిర్బంధించే నిరంకుశ చర్యలకూ దిగింది. దానిలో పత్రికల రాతలను అడ్డుకోవటం ఒక ప్రధాన లక్ష్యం. ఇప్పుడు న్యూస్‌క్లిక్ సంస్థ మీద మోపిన ఉపా ఉగ్రవాద చట్టం కూడా అలాంటిదే. నాడు వలస పాలకులు- నేడు మన స్వంత పాల కులు అన్న తేడా తప్ప అణచివేత సేమ్ సేమ్. అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు – పురచేతిని ముందుకు చాచి తిరగబడిన జనాన్ని నిలువరించలేరు అన్న వాస్తవాలు తెలిసినప్పటికీ అధికార మదం, దానికి మతోన్మాదం తోడైన పాలకులకు తాము అనుకున్నదాన్ని చేశామా లేదా అని తప్ప పర్యవసానాలతో పనిలేదు. దేనికైనా సమయం వస్తుంది. తొలి స్వాతంత్య్ర సమరం విఫలమైన 90 ఏండ్లకు జన ప్రభంజనంతో బ్రిటీష్ వాడు తోక ముడిచాడు. న్యూస్‌క్లిక్ వ్యాపార సంస్థకాదు, ప్రజా ఉద్యమాల గొంతుకగా ఉన్నదాన్ని జనం కాపాడుకుంటారు. బ్రిటీష్ పాలకులు ఒక పత్రికను మూసివేస్తే మరోపేరుతో కొత్త పత్రిక రంగంలోకి వచ్చినట్లు మరో పేరుతో ప్రజాగళం పురుడు పోసుకుంటుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.