– ‘ఇండియా’ కూటమి అనుమానాలు
– మూడు రాష్ట్రాల్లో ఊహించని ఫలితాలపై ఆశ్చర్యం
న్యూఢిల్లీ : ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) మళ్లీ చర్చకు వచ్చింది. పలు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్‌కు విరుద్ధంగా వచ్చిన ఈ ఫలితాలు సర్వత్రా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ముఖ్యంగా, రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌కు ఇది షాక్‌ను కలిగించింది. ‘ఇండియా’ కూటమి సైతం ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈనెల 7న వెలువడ్డాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ గెలిచి కాషాయ పార్టీ అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకున్నది. వాస్తవానకి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పలు వార్త సంస్థలు, సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి. పలు సంస్థలు ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనీ, తెలంగాణలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందని అంచనా వేశాయి. అలాగే, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెప్పాయి. అయితే, డిసెంబర్ 7న వెలువడిన ఫలితాల్లో మాత్రం ఇది పూర్తి విరుద్ధంగా మారింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో విస్పష్టమైన మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. అయినప్పటికీ.. ఫలితాల్లో ఇది ప్రతిబింబించకపోవటం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఊహించనీ రీతిలో కాషాయ పార్టీ సీట్లను గెలుచుకొని అధికారాన్ని సొంతం చేసుకోవటంపై కాంగ్రెస్‌తో పాటు ‘ఇండియా’ కూటమిలోని పలు పార్టీలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.ఫలితాలు వెలువడిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్ ఇవే ఆరోపణలు చేశారు. తమ ఓటమికి కారణం ఈవీఎంలేనని చెప్పారు. దీంతో ఈవీఎంలపై చర్చ మళ్లీ మొదటికొచ్చినట్టయ్యింది. ఈవీఎం అనేది ఒక పరికరమనీ, దానిని ట్యాంపరింగ్, హ్యాకింగ్ చేయవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. అలాగే, కావాల్సిన విధంగా ప్రోగ్రామింగ్ చేసుకునే అవకాశాలనూ కొట్టిపారేయలేమని చెప్తున్నారు. ఇలాంటి అనుమానాల నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం బ్యాలెట్ పోరుకు డిమాండ్ చేస్తున్నది. మరికొన్ని పార్టీలైతే వీవీప్యాట్‌లను వంద శాతం లెక్కించాలనీ, లేదనకుంటే వాటిని ఓటరుకు ఇచ్చి బ్యాలెట్ బాక్స్‌లో వేసే విధంగా సిస్టమ్‌ను మార్చాలని చెప్తున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల సంఘం ఈ విషయంలో వేగంగా స్పందించి అందుకు అనుగుణంగా మార్పులు తీసుకురావాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు కోరుతున్నాయి.