దళితుల వద్ద బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే నొక్కిన డబ్బులు కక్కాలి

– జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధ్యత వహించాలి
– సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
నవతెలంగాణ-చేర్యాల
దళితబంధు ఇప్పిస్తామని దళితుల వద్ద బీఆర్‌ఎస్‌ జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీసుకున్న డబ్బులను కక్కాలని సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో శనివారం ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ముస్త్యాల ప్రభాకర్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ దళితబంధు పథకంలో రూ.10 లక్షలు ఇప్పిస్తామని చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలలో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన అనుచరులైన బీఆర్‌ఎస్‌ జెడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, కౌన్సిలర్లను ఉపయోగించుకొని దాదాపు 144 మంది దళితులు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేశారని, దాదాపు రూ.2.8 కోట్ల వరకు దండుకుని దళితబంధు పథకం మంజూరు చేయించలేదన్నారు. తీసుకున్న డబ్బులను ప్రతి దళితుడికి మిత్తితో సహా మాజీ ఎమ్మెల్యే చెల్లించాలని, దీనికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత పది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పారు. చివరికి నిరుపేద దళితుల మీద ఏమాత్రం కనికరం చూపకుండా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంత ఘోరానికి పాల్పడ్డాడన్నారు. మోసపోయిన దళితులు ఎవరికి వారు రోడ్డెక్కి న్యాయం చేయాలని రోధిస్తున్నారని, దళితుల పట్ల వెంటనే పోలీస్‌ శాఖ, మానవ హక్కుల విభాగం, ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి పూర్తి సమాచారాన్ని సేకరించి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అతని అనుచరులైన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులపై చర్యలు తీసుకోవాలన్నారు. మాయమాటలు చెప్పి అమాయక దళితులను మోసం చేసి దండుకున్న డబ్బులను వడ్డీతో సహా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నుంచి కక్కించాలని డిమాండ్‌ చేశారు. దళితుల వద్ద తీసుకున్న డబ్బులను మిత్తితో సహా తిరిగి ఇప్పించే వరకు బాధిత దళితులకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇంత ఘోరం జరుగుతుంటే ఏమీ తెలియనట్లు నటిస్తున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ వ్యవహారంపై పూర్తి బాధ్యత తీసుకొని దళితులకు డబ్బులు తిరిగి ఇప్పించి న్యాయంం చేయాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో తమ పార్టీ బాధిత దళితులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ చేర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో, నాయకులు పోలోజు శ్రీహరి, జిల్లా కమిటి సభ్యులు బండకింది అరుణ్‌,దాసరి ప్రశాంత్‌,నాయకులు బోయిని మల్లేశం, దాసరిచక్రపాణి, దర్శనం రమేష్‌,రాళ్లబండి చందు, బాలస్వామి, గొర్రె శ్రీనివాస్‌, రంజిత్‌ రెడ్డి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.