సామాజిక కార్యకర్తల్ని అడ్డుకోవడం దుర్మార్గం : మాజీ మంత్రి హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నిజనిర్దారణ కోసం లగచర్ల వెళ్లిన సామాజిక కార్యకర్తలు, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ఇతర మహిళా సభ్యులను అడ్డుకోవటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కంచెలు, ఆంక్షలు, నిర్బంధాలు లేని పాలన అని చెప్పిన సీఎం రేవంత్‌.. అవి లేకుండా పాలన చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. లగచర్లలో గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయం వెలుగు చూడకుండా ఎంత మందిని అడ్డుకుంటారు? అని ప్రశ్నించారు. అధికారం ఉందని అహంకారంతో సీఎం సాధారణ ప్రజలనే కాదు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలను నిర్బంధాలకు గురిచేస్తున్నాడనీ, నిర్బంధ, నిరంకుశ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.