ప్రజలను వేధించే ప్రభుత్వాలను ఓడించాలి: మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి

నవతెలంగాణ -నవీపేట్
ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలనే వేధిస్తున్న ప్రభుత్వాలను ఓడించాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సుభాష్ నగర్ లో బూత్ ఏజెంట్ల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ తన హయాంలోనే ప్రాజెక్టులు, పాఠశాలలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మరియు ఆసుపత్రిలు నిర్మించినవని బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క అభివృద్ధి చేసిందా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 50 వేల కోట్ల బడ్జెట్ తోనే ఎంతో అభివృద్ధి చేశామని కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం 2,40,000 కోట్ల బడ్జెట్ తో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.ఎన్నికల్లో బిజెపి,బిఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోగా ధరలు ఆకాశాన్ని అంటేలా చేశారని అన్నారు. కెసిఆర్ కుటుంబ ప్రయోజనాల కోసమే ధరణి తీసుకొచ్చారని తమ ప్రభుత్వం రాగానే ధరణిని రద్దు చేస్తామని అన్నారు. ప్రజలకు అన్యాయం చేసి వేధిస్తున్న ప్రభుత్వాలను ప్రజలే ఓడించాలని అన్నారు. అంతకుముందు కమలాపూర్ గ్రామంలో పార్టీ నాయకులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వృద్ధులతో మాట్లాడుతూ పెద్దకొడుకు పింఛన్ పేరుతో ధరలు పెంచి నామం పెట్టాడంటూ మంత్రి చెప్పగా ఓ వృద్ధురాలు సంక్షేమ ప్రభుత్వమైనా కాంగ్రెస్ కు నామం పెట్టి మాకు సున్నం పెట్టాడంటూ చెప్పడంతో అక్కడ వున్న వారంతా నవ్వుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4 వేల రూపాయల పింఛన్ ఇస్తామని అన్నారు. కమలాపూర్, నవీపేట్ లో కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాహెర్ బిన్ హంధాన్, పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, సాయరెడ్డి, భగవాన్, బాబు, మూస తదితరులు పాల్గొన్నారు.