పది శాతం అభివృద్ధి చేస్తే పోటీ నుండి తప్పుకుంటా.. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి

నవతెలంగాణ- నవీపేట్: బోధన్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిలో ఎమ్మెల్యే షకీల్ 10 శాతం అభివృద్ధి చేస్తే పోటీ నుండి తప్పుకుంటానని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను చేసిన అభివృద్ధిలో ఎమ్మెల్యే షకీల్ 10 శాతం కూడా చెయ్యకుండా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. గొప్పలు చెప్పే బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓటుతోనే బుద్ధి చెప్పాలని సూచించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ధరలు పెంచి పేదల నడ్డి విరిచిందని విమర్శించారు. రాష్ట్రంలో బిజెపి, బీఆర్ఎస్ రెండు ఒకటేనని అన్నారు. బిఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టేనని అన్నారు. అనంతరం మైనార్టీ యువకులు కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, రామచందర్, బాల్రాజ్ గౌడ్, సాయిలు, చల్లా రవీందర్ తదితరులు పాల్గొన్నారు.