ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష ఫీజు మాఫీ

Exam Fee Waiver for Govt Jobs– మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష ఫీజు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇక్కడ కోటి మందికిపైగా యువత నిరుద్యోగులుగా ఉన్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రదీప్‌ జైన్‌ ఆదిత్య మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలో కోటి మందికిపైగా నిరుద్యోగులుండగా వీరిలో 40 లక్షల మంది ప్రభుత్వం వద్ద నమోదై ఉన్నారన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ఉద్యోగాల కోసం పరీక్ష ఫీజుగా ఈ యువత నుంచి రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలిపారు. ‘ఇది గత 10 ఏండ్లలో పేద అభ్యర్థులకు అనేక సమస్యలను సష్టించింది. గత 18 ఏండ్లలో 17,298 మంది నిరుద్యోగ యువత బలవన్మరణాలకు పాల్పడ్డారంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు’ అని అన్నారు.
యువకుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే యువతకు పరీక్ష ఫీజులు మాఫీ చేస్తామని, కేంద్ర మాజీ మంత్రి ప్రదీప్‌ జైన్‌ ఆదిత్య అక్టోబర్‌ 31న ఈ హామీ ఇచ్చారు. ఇదొక్కటే కాదు, ఫలితాలను నిలిపివేసిన పరీక్షలపై దర్యాప్తు చేయడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆన్‌లైన్‌ పరీక్షలకు బదులుగా ఆఫ్‌లైన్‌ పరీక్షలను నిర్వహిస్తుందని ఆయన అన్నారు
ఉద్యోగ నియామకాల్లో మోసాలు, ఫలితాల ప్రకటనలో జాప్యం, పేపర్‌ లీకేజీల వల్ల యువత చాలా నష్టపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరగడానికి ఇదే ప్రధాన కారణం. వ్యాపం, పట్వారీ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌ల వంటి అనేక కుంభకోణాలు రాష్ట్రంలో జరిగాయి. ఇది యువత నైతికతపై ప్రత్యక్ష ప్రభావం చూపిందన్నారు.
రాష్ట్రంలో నవంబర్‌ 17న పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈసారి పోటీ కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, ఈ ప్రభుత్వం కేవలం 15 నెలలు మాత్రమే ఉంటుంది. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత శివరాజ్‌ సింగ్‌ నేతత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.