– కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి
– యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి
నవతెలంగాణ- నల్లగొండ
18 ఏండ్లుగా ఆశా వర్కర్లుగా పని చేస్తున్న వారికి ఎగ్జామ్ పెట్టి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని, వెంటనే ఎగ్జామ్ రద్దు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని దొడ్డికొమురయ్య భవనంలో ఆ యూనియన్ నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం డి.మహేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ అనేక ఏండ్ల నుండి రాష్ట్రంలో ఆశా వర్కర్లు పేద ప్రజలకు అనేక రకాల ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. ఆసుపత్రిలో డెలివరీలు చేయించడం, మాత శిశు మరణాలను తగ్గించడంలో ఆశాలు వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇంత పనిచేస్తున్న ఆశాలను మాత్రం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. కనీస వేతనం, పెన్షన్, ఈఎస్‌ఐ ,ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధత సౌకర్యాలు ఏమి ఇప్పటివరకు కల్పించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు ఎగ్జామ్ నిర్వహించి ఉత్తీర్ణత సాధించని వారిని ఇంటికి పంపాలని నిర్ణయం చేసిందన్నారు. ఇది ఆశాలను కించపరచడంతో పాటు ఆశాల సీనియార్టీని తగ్గించి ఉద్యోగ భద్రత లేకుండా చేయడం తప్ప మరొకటి కాదన్నారు. .ఆశాలకు నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసహారించుకోవాలని పెరుగుతున్న ధరలకనుగుణంగా కనీస వేతనం 18 వేల రూపాయలకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. జూన్ 5న ఆశా డే సమావేశాల సందర్భంగా పీహెచ్‌సీల ముందు, 12న కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆ యూనియన్ జిల్లా నూతన కమిటీని 25 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా చినపాక లక్ష్మీనారాయణ, అధ్యక్షులుగా డి.మహేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా తవిటి వెంకటమ్మ, కోశాధికారిగా జె.వసంత, ఉపాధ్యక్షులుగా రమావత్ కవిత, బి సుజాత, సహాయ కార్యదర్శిలుగా టి.పార్వతమ్మ, కమిటీ సభ్యులుగా సిహెచ్ .మమత ,ఎస్.జయమ్మ ,సిహెచ్.ధనలక్ష్మి ,నిమ్మల నాగమ్మ, ఎస్.విజయ, ఏ.పద్మ, డి.ఇందిరా కోరే లలిత పి.వెంకటమ్మ, వి.పార్వతమ్మ, భూపతి రేణుక, పుట్టల విగేశ్వరి ,భాగ్యమ్మలను ఎన్నుకున్నారు.