
– వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలు
– పొలాలు ఇండ్ల మధ్యలో ఇటుక బట్టీల నిర్వహణ
నవతెలంగాణ – పెద్దవూర
మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అనుమతులు లేకుండా మట్టి తవ్వి విక్రయిస్తూ కొందరు అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. రైతుల అవసరాల సాకుతో మండలం లోని నాయిన వాణికుంట చెరువులో గత రెండు రోజులుగా కొల్లగొట్టి తరలించుకుపోతున్నారు. కొంత మంది ట్రాక్టర్ యజమానులు మట్టి మాఫియా అవతారం ఎత్తి వ్యాపారం చేస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడంతో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి.మండలం లోని నాయినవానికుంట చెరువు చెరువులు, కుంటల తోపాటు ప్రైవేటు భూములలో నుంచి మట్టిని మాఫియా తవ్వేస్తుంది. మట్టిని ట్రాక్టర్లల్లో ఖాళీ స్థలాలు, లేఅవుట్లుకు తరలిస్తూ ఒక్కొక్క ట్రాక్టర్ ఐదు వందల నుంచి ఏడు వందల వరకు వసూలు చేస్తున్నారు భారీగా మట్టి వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో చెరువులలో తీసిన మట్టిని రైతులకు ఉపయోగపడే మట్టిని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలు..
భూ పరిరక్షణ చట్టం 129/12 లో పేర్కొన్నట్లుగా వ్యవసాయానికి పనికి రాని భూముల్లో ఇటుక బట్టీలు నిర్వహించాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మండల కేంద్ర పరిధిలో పంట భూముల్లోనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులకు మామూళ్లు చెల్లించి అడ్డదారుల్లో బట్టీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ వ్యవహారం యథేచ్ఛగా కొనసాగుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు.పచ్చని పొలాల పక్కనే ఇటుక బట్టీలు నిర్వహిస్తుండడంతో ఆ ప్రభావం వాటిపై పడి పంటలు నష్టపోతున్నాయి.
వ్యాపారులదే హవా..
ఇటుక బట్టీల కోసం చెరువు మట్టి ని అక్రమ రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం మూలంగా వారు ఇష్టారాజ్యంగా దందాను కొనసాగిస్తున్నరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇటుక తయారీ కోసం అక్రమార్కుల కన్ను చెరువు మట్టిపై పడింది. సంబంధిత శాఖ అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపినట్టు విశ్వసనీయ సమాచారం.
పంటలపై ప్రభావం..
పొలాల మధ్య ఇటుకల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల వాటి కోసం ఉపయోగించే వ్యర్థాలు, పొట్ట, బొగ్గు, ప్లాస్టిక్ వస్తువుల కారణంగా పంటల దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రైతు వాపోయారు. ఏటా వరి, ఇతర పంటల సాగు చేస్తున్నారు. దిగుబడి రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మట్టి మాఫియా, ఇటుకల తయారీ కేంద్రాల నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.