మణిపూర్‌లో మితిమీరిన హక్కుల ఉల్లంఘన

Excessive rights violations in Manipur– విద్వేష ప్రసంగాలతో హింసాకాండ
– ఐరాస నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ: మణిపూర్‌ హింసాకాండ లో మానవ హక్కుల ఉల్లంఘన మితిమీరిపోయిందని ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై పాలకుల స్పందన సరిగా లేదని విమర్శించింది. మణిపూర్‌ లో పరిస్థితి తీవ్రంగా ఉన్నదని అంటూ లైంగిక హింస, ఆటవిక హత్యలు, గృహ విధ్వంసాలు, బలవంతపు నిర్బంధాలు, అమానుష ప్రవర్తన పెచ్చు మీరిపోయాయని మండిప డింది. ఈ మేరకు 18 మందితో కూడిన మానవ హక్కులనిపుణుల బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. ఐరాస మానవ హక్కుల మండలిలో పని చేస్తున్న ప్రత్యేక విలేకరులలో పలువురు ఈ బృందంలో సభ్యులుగా వ్యవహరించారు. ‘మణిపూర్‌లో హింసాకాండ పెచ్చరిల్లింది. సామూహిక లైంగికదాడులు చేయడం, వీధుల్లో మహిళల్ని నగంగా ఊరేగించడం, దారుణంగా కొట్టి చంపడం, సజీవ దహనం చేయడం వంటి దారుణాలు అనేకం జరిగాయి. సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టేలా విద్వేష ప్రసంగాలు చేస్తూ హింసను ప్రేరేపించారు. కుకీ మైనారిటీలు… ముఖ్యంగా మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వేధింపులకు తెగబడ్డారు. న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు నిజ నిర్ధారణ కోసం మణిపూర్‌కు బృందంగా వెళితే వారిని వేధించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్లిన ఎడిటర్స్‌ గిల్డ్‌ పాత్రికేయుల పైనే కేసులు పెట్టారు. చివరికి మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ సైతం ఎడిటర్స్‌ గిల్డ్‌నే దూషించారు. మణిపూర్‌లో జరిగింది ప్రభుత్వ ప్రేరేపిత హింసాకాండేనని తేల్చిన మహిళా సమాఖ్య సభ్యుల పైన కూడా కేసులు పెట్టారు’ అని నిపుణుల బృందం తెలిపింది. మణిపూర్‌ హింసపై కేంద్రం స్పందన కూడా సరిగా లేదని నిపుణుల బృందం ఎత్తిపొడిచింది. కాగా నిపుణుల బృందం ప్రకటన అవాంఛనీయం, ఊహాజనితం అని కేంద్రం వ్యాఖ్యానించింది. ఇది ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది.