– సోషల్ మీడియాలో హద్దులు దాటుతున్న బీజేప ీతీరు
– రిజర్వేషన్ అంశంపై ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద పోస్టు
– ఎక్స్‌లో పోస్ట్ చేసిన బీజేపీ కర్నాటక యూనిట్
– కమలం పార్టీ తీరుపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
బెంగళూరు : లౌకిక భారతదేశంలో బీజేపీ మత పిచ్చిని రేపుతున్నది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక అజెండా అంటూ లేకుండా.. కేవలం మతాల మధ్య విద్వేషాలు రగిలేలా బీజేపీ ప్రచారం చేస్తున్నది. బహిరంగ సమావేశాలైనా, బహిరంగ సభలైనా విభజనవాదాన్ని మాత్రమే ఆ పార్టీ వినిపిస్తున్నది. ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా మొదలు కింది స్థాయి నాయకులు, కార్యకర్తల వరకు కూడా ఇదే తీరును పాటిస్తున్నారు. బీజేపీ చేస్తున్న ప్రచారతీరుపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ తీరులో మాత్రం మార్పు కనిపించటం లేదు.
కర్నాటకలో మతం ఆధారంగా ఒక వర్గాన్ని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ కేటగిరిలో చేర్చిందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇది అసలైన ఓబీసీల రిజర్వేషన్‌ను దెబ్బతీస్తుందని ఆరోపిస్తున్నది. అయితే, ఆ వర్గాన్ని కాంగ్రెస్ తీవ్రంగా బుజ్జగిస్తున్నదనీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు భంగం కలిగేలా ఆ వర్గాన్ని అక్కున చేర్చుకుంటున్నదనే అర్థం వచ్చేలా కర్నాటక కాంగ్రెస్ యూనిట్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది.
వివాదాస్పద వీడియోలో ఏమున్నది?
ఈ వీడియోలో ఉన్న కంటెంట్‌ను బట్టి చూస్తే.. ఒక గూడులో మూడు గుడ్లు ఉంటాయి. ఒక్కో గుడ్డు పైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అని రాసి ఉంటుంది. అయితే, ఆ గూడులో ఉన్న మూడు గుడ్లకు అదనంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు మరొక గుడ్డును అదనంగా తెచ్చి వేస్తారు. ఆ గుడ్డుపై ఒక మతానికి చెందిన పేరు ఉంటుంది. తర్వాత ఆ నాలుగు గుడ్ల నుంచి వచ్చిన పిల్లల్లో ఒకదానికి ‘ఒక మతం’ను సూచించేలా నెత్తిన టోపీ ఉంటుంది. సిద్ధరామయ్యతో కలిసి వచ్చిన రాహుల్ గాంధీ ఆ మతానికి చెందిన పక్షికి మాత్రమే ‘నిధుల’తో పోషిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ పక్షి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ గుడ్ల నుంచి పొదిగిన పక్షి పిల్లలను ఆ గూడు నుంచి తోసేయటం, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య పాత్రలు నవ్వటం కనిపిస్తుంది.
వివాదాస్పద పోస్ట్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు
ఇటు ఈ అంశంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జె.పి నడ్డా, ఆ పార్టీ ఐటీ విభాగం ఇంఛార్జ్ అమిత్ మాల్వియా, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బి.వై విజయేంద్రలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మతాల మధ్య విద్వేషాన్ని రగిల్చేలా, శతృత్వాన్ని పెంపొందించేలా బీజేపీ పోస్ట్ ఉన్నదని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ వీడియో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిందని తెలిపింది. మైనారిటీలను ఈ విధంగా చిత్రీకరించే బీజేపీ పోస్ట్ ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ నాయకుడు మానిక్కం ఠాగోర్ అన్నారు.
దేశం బీజేపీకి తగిన పాఠం నేర్పుతుంది : ప్రకాశ్‌రాజ్
ఈ వివాదాస్పద పోస్టుపై పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక మతానికి చెందినవారిపై చెడు అభిప్రాయం వచ్చేలా బీజేపీ షేర్ చేసిన వీడియో ఉన్నదనీ, ఇలాంటి చర్యలు సమాజానికి శ్రేయస్కరం కావని మేధావులు అన్నారు. అసహ్యమైన, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న, మత రాజకీయాలు చేస్తున్న హిందూత్వ పార్టీకి కర్నాటక, దేశం తగిన సమాధానం చెప్తుందని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. బీజేపీ వీడియోను ‘సిగ్గులేని’ పోస్ట్‌గా ఆయన అభివర్ణించారు. బీజేపీ షేర్ చేసిన వీడియో అనేది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాకపోతే కోడ్‌నే రద్దు చేయాల్సిన అవసరం ఉంటుందని విశ్లేషకులు, రాజకీయ వ్యాఖ్యాత సుమంత్ రామన్ ఆరోపించారు. బీజేపీ చర్య అవమానకరమైనదిగా అభివర్ణించారు.