వినిమయ, విషప్రచారాన్ని అడ్డుకోవాలి

Exchange and poison should be prevented– పీఎన్‌ఎం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్‌, కట్టా నర్సింహ
నవతెలంగాణ-భువనగిరి
సమాజంలో వస్తున్న వినిమయ, విషప్రచారాన్ని అడ్డుకోవాలని, అందుకోసం నేటి సమాజానికి అవసరమయ్యే కళలు, సంస్కృతిని అందించాలని ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్‌, కట్టా నర్సింహ తెలిపారు. ఆదివారం భువనగిరి జిల్లాకేంద్రంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సమావేశం, రెండ్రోజుల శిక్షణాతరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి సమాజంలో చరిత్రను వక్రీకరించే విధంగా సినిమాలు వస్తున్నాయన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాటం లేకుండా తెలంగాణ ప్రజలు విముక్తి కాలేరన్నారు. దేశంలో, రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ, మూఢవిశ్వాసాలను పెంచుతూ ప్రజల్లో విధ్వేషాలను బీజేపీ సృష్టిస్తున్నదని తెలిపారు. తద్వారా రాజకీయ లబ్ది పొందడానికి కృషి చేస్తున్నారని, అలాంటి వారిని తిప్పి కొట్టాలన్నారు. భారతీయులందరూ ఒకటేనని చాటి చెప్పే కళారూపాలు, పాటలు, నృత్యాలను తయారు చేయాలన్నారు. వాటిని సోషల్‌ మీడియాలో అధునాతన పద్ధతిలో ప్రజలకు అందే విధంగా పెట్టాలని తెలిపారు. నేటి యువత మత్తు పదార్థాల వైపు పయనించే విధంగా కుట్రలు జరుగుతున్నాయన్నారు. వాటిని తిప్పి కొట్టడానికి మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం, ఆర్థిక, విలువలు ఎలా పోతాయో వివరించాలన్నారు. కవులు, కళాకారులు నూతనంగా రచించిన పాటలు పాడారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అవ్వార్‌ గోవర్థన్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి ముత్యాలు, రవి, శివ తదితరులు పాల్గొన్నారు.