
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ లో ఈత, తాటి చెట్లు నాటడంలో ఎక్సైజ్ శాఖ తీవ్ర నిర్లక్ష్యం చేసిందని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎండాకాలం లో నిప్పు అంటుకుని తాటి ఈత చెట్లు కాలిపోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని ఐదు సంవత్సరాలకు కల్లు పారే 200 హైబ్రిడ్ ఈత మొలకలు తెప్పించారన్నారు. గీతా కార్మిక సొసైటీకి 1000 ఈత మొలకలు ఇప్పించారన్నారు. వర్షాకాలం ముగుస్తున్న ఇప్పటికీ ఇటు ఎక్సైజ్ శాఖ,పట్టణ సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్లు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. మొక్కలు నాటడం సొసైటీ అధ్యక్షుడు కు ఇష్టం లేకపోతే ఎక్సైజ్ శాఖ వెంటనే వేరే గ్రామానికి ఇవ్వాలని ఎక్సైజ్ సిఐని కోరినట్లు తెలిపారు .ఇప్పటికే ఈత మొలకల్లో సగం మటుకు చనిపోవడం జరిగిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఈత మొలకలు దాదాపు అన్ని గ్రామాలలో గీతా కార్మికులు నాటడం జరిగిందనీ హుస్నాబాద్ లో మాత్రం సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్లు, ఎక్సైజ్ శాఖ గీతా కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. గీతా కార్మికుల సమస్యలు పట్టించుకోనప్పుడు అధ్యక్షులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.