బైక్‌ను ఢకొీట్టిన కారు.. ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతి

బైక్‌ను ఢకొీట్టిన కారు.. ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతినవతెలంగాణ-హయత్‌నగర్‌
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి కారు బైక్‌ను ఢకొీట్టడంతో ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రాణం కోల్పోయారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ దయాకర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలానికి చెందిన మహమ్మద్‌ సాదిక్‌ అలీ(40) చార్మినార్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి అతను పని ముగించుకుని నారాయణగూడ ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఖాజావలీ మొయినుద్దీన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై ఎల్‌బీనగర్‌ నుంచి మలక్‌పేట్‌ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్‌లో ఉన్న ప్రభుత్వ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఎదురుగా కారు రాంగ్‌ రూట్‌లో వచ్చి వారి బైక్‌ను ఢకొీట్టింది. దాంతో సాదిక్‌ అలీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఖాజావలీ మొయినుద్దీన్‌ ఎల్బీనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారు నడిపిన అరవింద్‌ అనే వ్యక్తికి సైతం తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.