కోల్డ్‌ స్టోరేజ్‌లపై ఎక్సైజ్‌ దాడులు

– 30 టన్నుల నల్ల బెల్లం స్వాధీనం
– రూ. కోటి 20 లక్షల విలువ ఉంటుందని అంచనా
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగడానికి ఎక్సైజ్‌ శాఖ అధికారులు అన్ని రకాలుగా దాడులను ముమ్మరం చేసింది. ఎక్సైజ్‌ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఏ.చంద్రయ్య నేతత్వంలో ఇబ్రహీంపట్నం ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని పటేల్‌ గూడ వద్దనున్న చేపురి అగ్రో కోల్డ్‌ స్టోరేజ్‌, హయత్‌ నగర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని కొహెడలోని వైష్ణవి కోల్డ్‌ స్టోరేజ్‌లపై దాడులు నిర్వహించారు. పటేల్‌ గూడలో 22టన్నులు, కోహెడలో 8 టన్నుల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. కోల్డ్‌ స్టోరేజ్‌ యజమానులకు నోటీసు ఇచ్చి సీజ్‌ చేశారు. గత రెండు రోజులుగా ఎక్సైజ్‌ స్టేషన్‌ ఇబ్రహీంపట్నం పరిధిలో గుడుంబా తయారీ కేంద్రంపై దాడులు నిర్వహిస్తున్నారు. దాడుల్లో పట్టుబడిన నేరస్తులను విచారణ చేయగా నల్ల బెల్లం నిల్వచేసి విక్రయించేందుకు సదరు కోల్డ్‌ స్టోరేజ్‌ నుంచి సరఫరా జరుగుతున్నట్టు వెల్లడైందని అధికారులు తెలిపారు. అందుకే ఐదు బందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించి నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ సుమారుగా రూ. 1 కోటి 20 లక్షలుగా ఉంటుందని జిల్లా అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ ఏ. చంద్రయ్య తెలిపారు. ఈ దాడుల్లో సరూర్‌ నగర్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ టి.రవీందర్‌ రావు, ఎస్టీఎఫ్‌ ఈఎస్‌ అరుణ్‌ కుమార్‌, సరూర్‌ నగర్‌ ఏఈఏస్‌ బి. హనుమంతరావు, ఇబ్రహింపట్నం ఎక్సైజ్‌ సీఐ. శ్రీనివాస్‌ రెడ్డి, హయత్‌ నగర్‌ సీఐ టి. లక్ష్మణ్‌ గౌడ్‌, డీటీఎఫ్‌ టి.సత్యనారాయణ, ఎస్‌ఐ యాదయ్య, బి.వెంకన్న, జి.హనుమంతు, పి. విష్ణు , ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.