హున్సాలో ఉత్కంఠగా పిడిగుద్దులాట

హున్సాలో ఉత్కంఠగా పిడిగుద్దులాట– ఉపిరి బిగపట్టి తిలకించిన జనం
నవతెలంగాణ-బోధన్‌
నిజామాబాద్‌ జిల్లా సాలూర మండలంలోని హున్సాలో ప్రతేడాది హోలీ వేడుకల్లో భాగంగా పిడిగుద్దులాట సోమవారం సైతం ఉత్కంఠగా సాగింది. గ్రామం నడిబొడ్డున రెండు దుంగలను ఏర్పాటు చేసి తాడును కట్టారు. గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి తాడుకు ఇరువైపులా చేరుకున్నారు. సమయం సోమవారం సాయంత్రం ఆరు గంటలు కాగానే ఒకరిపై ఒకరు ఒక్కసారిగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఒక చేత్తో తాడును పట్టుకొని మరో చేత్తో హోరాహోరీగా గుద్దుకున్నారు. పది నిమిషాలు కాగానే అందరూ శాంతించి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. పిడిగుద్దులాటను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.