– పట్టణాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యారంగం, వైద్యరంగాలకు స్వల్పంగా నిధుల కేటాయింపు పెరగడం హర్షణీయమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. విద్యకు 6.7 శాతం నుంచి 7.75 శాతానికి, వైద్యరంగానికి 3.6 శాతం నుంచి 4.17 శాతానికి నిధులు పెరిగాయనీ, దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. శనివారం శాసనమండలి ఆవరణలోని మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ విద్యావైద్య రంగాలకు నిధుల పెరుగుదల ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలని కోరారు. గురుకుల విద్యాసంస్థలు అద్దెభవనాల్లో ఉన్నాయని చెప్పారు. ఎస్సీ గురుకులాల శాశ్వత భవనాల కోసం రూ.వెయ్యి కోట్లు, ఎస్టీ గురుకులాల శాశ్వత భవనాల కోసం రూ.250 కోట్లు, బీసీ గురుకులాల శాశ్వత భవనాల కోసం రూ.1,546 కోట్లు కేటాయించడాన్ని ఆహ్వానిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మండలానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం పైలెట్ ప్రాజెక్టు కింద రూ.500 కోట్లు కేటాయించడం పట్ల భిన్నాభిప్రాయం ఉందన్నారు. పట్టణాల్లో జనాభా పెరుగుతున్నదనీ, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతున్నదని వివరించారు. పట్టణాల్లోని విద్యార్థులు ఎక్కువ మంది ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుతున్నారని చెప్పారు. అందువల్ల హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ స్కూళ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. రైతుబంధును రైతులకే వర్తింపజేయాలంటూ మొదటి నుంచీ గత ప్రభుత్వానికి సూచించాననీ, అయినా పట్టించుకోలేదని చెప్పారు. అందువల్ల ఇప్పటికైనా పంట పండించిన వారికే పెట్టుబడి సాయం అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంట భూములకే రైతుబంధు ఇస్తామనీ, పడావు పడ్డ భూములకు ఇవ్వబోమని ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నామని అన్నారు. కౌలురైతులకూ పెట్టుబడి సాయం ఇస్తామనడాన్ని స్వాగతిస్తు న్నామని చెప్పారు. గతం కంటే ఇది సానుకూల బడ్జెట్ అనీ, దీన్ని అభినందిస్తున్నామని అన్నారు.