ఉత్సాహంగా మోటోజీపీ రేసు

– హైదరాబాద్‌ టూర్‌లో 400 మంది రైడర్ల పోటీ
హైదరాబాద్‌ : మోటోజీపీ భారత్‌ కౌంట్‌డౌన్‌ ఘనంగా మొదలైంది. ఆదివారం హైటెక్‌ సిటీలో హైదరాబాద్‌ టూర్‌ రేసుకు విశేష స్పందన లభించింది. మోటోజీపీపై అవగాహన, ఔత్సాహిక రైడర్లను ఏకతాటికిపైకి తీసుకురావటమే లక్ష్యంగా సాగిన హైదరాబాద్‌ రేసులో సుమారు 400 మంది రైడర్లు పోటీపడ్డారు. ‘హైదరాబాద్‌ రేసులో మహిళా రైడర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేసింగ్‌ కమ్యూనిటీలో మహిళల సంఖ్య విశేషంగా పెరిగంది అనేందుకు ఇదే సంకేతం. హైదరాబాద్‌ టూర్‌ రేసు విజయవంతమైన ఉత్సాహంలో తదుపరి రేసును ఈ నెల 23న అహ్మదాబాద్‌లో నిర్వహిస్తున్నాం. సెప్టెంబర్‌ 22-24 వరకు గ్రేటర్‌ నోయిడాలోని బుద్ధ ఇంటర్నేషనల్‌ ట్రాక్‌లో మోటోజీపీ భారత్‌ ఫైనల్స్‌ జరుగుతాయని’ ఫెయిర్‌ స్ట్రీట్‌ స్పోర్ట్స్‌ ఎండీ సుశాంత్‌ తెలిపారు. హైదరాబాద్‌ రేసు సందర్భంగా రేసు ట్రాక్‌ ప్రాంతంలో మెగా డీజే షోలు, బైక్‌ స్టంట్లు, ఫుడ్‌ స్టాల్స్‌, సెల్ఫీ బూత్‌లు, 360 వీఆర్‌, గేమింగ్‌ బూత్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి.