కాశ్మీర్‌లో కూటమిపై కసరత్తు

– నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ నేతల భేటీ
– అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీకి అంగీకారం
శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఈ దిశగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమి ఏర్పాటుపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని సంకేతాలు వస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు, భావసారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుని వెళ్లడం వంటి అంశాలపైనా కసరత్తు సాగుతున్నది. ఇక జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ నెలకొంది. జమ్మూకాశ్మీర్‌ మాజీ మంత్రి, డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ (డీపీఏపీ) నేత తాజ్‌ మొహియుద్దీన్‌ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. తాను గత 45 ఏండ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, కానీ కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్లినా ఇప్పుడు తిరిగి పార్టీలోకి వస్తున్నానని ఆయన వెల్లడించారు. గులాం నబీ ఆజాద్‌తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీగా తాము విజయం సాధించలేమని కుండబద్దలు కొట్టారు. ఆజాద్‌ సాబ్‌ను కూడా తిరిగి సొంతగూటికి (కాంగ్రెస్‌) తీసుకొస్తానని తెలిపారు. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని పార్టీ తనను ఎంతగానో గౌరవించిందని తాజ్‌ మొహియుద్దీన్‌ పేర్కొన్నారు. కాగా, జమ్మూకాశ్మీర్‌లో సెప్టెంబర్‌ 18, సెప్టెంబర్‌ 25, అక్టోబర్‌ 1న, హర్యానాలో అక్టోబర్‌ 1న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. జమ్మూకాశ్మీర్‌లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్‌-డిసెంబర్‌లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.