సంఘటితంతోనే హక్కుల సాధన

Exercising rights through organization– మెడికల్‌ రంగంలో సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌ పాత్ర కీలకం
– మందుల ధర తగ్గుదల, వైద్యరంగంపై జీఎస్టీ ఎత్తివేతపై నిలబడటం హర్షణీయం
– సమాజహితానికి పోరాడుతున్న టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ
– లేబర్‌ చట్టాలు కుదించి యాజమాన్యాలకు వంతపాడుతున్న కేంద్రం
– కార్మిక హక్కులను, యూనియన్‌ ఉద్యమా లను అణచివేసేలా కుట్రపూరిత చర్యలు
– ‘పాలిటిక్స్‌’ను దూరదృష్టితో అర్థం చేసుకోవాలి
– సమాజాన్ని చైతన్యపరచాలి: ఆల్‌ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ పూర్వ అధ్యక్షలు కె.వేణుగోపాల్‌
– టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ రాష్ట్ర ఐదో మహాసభ ప్రారంభం
– నేడు రాష్ట్ర కమిటీని ఎన్నుకోనున్న ప్రతినిధుల సభ
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రతి రంగంలోని ఉద్యోగులు, కార్మికులు సంఘటితంగా ఉంటేనే హక్కులు సాధించుకోగలుతారు. తమ హక్కులతోపాటు జనహితాన్ని కోరుతూ పాలకులను ప్రశ్నిస్తున్న మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌ పాత్ర అభినందనీయం. నాసిరకం మందుల నివారణకు కొట్లాడుతూనే.. నాణ్యతమైన మందుల తయారీ, ప్రజలకు అందుబాటు ధరలో అందించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజల పక్షాన నిలబడటం హర్షణీయం. ప్రజలకు అత్యవసర సేవలందించే వైద్యరంగంపై జీఎస్టీ వసూలు చేస్తున్న కేంద్రాన్ని నిలదీస్తున్నారు.. నిలదీయాల్సిందే! ప్రస్తుతం దేశంలోని కేంద్ర సర్కారు లేబర్‌ చట్టాలను కుదించి కార్మిక, ఉద్యోగుల హక్కులను ఒక్కొక్కటిగా హరిస్తూ యూనియన్‌గా ఉద్యమిస్తే అణచివేసే కుట్రలు చేస్తోంది.. వీటన్నింటినీ పరిశీలిస్తూ పాలకుల ‘పాలిటిక్స్‌’ను దూరదృష్టితో అర్థం చేసుకుని సంఘం మనుగడకు పాటుపడాలి’ అని ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ పూర్వ అధ్యక్షులు కె.వేణుగోపాల్‌ సూచించారు. తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఐదో మహాసభ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని పద్మశాలీభవన్‌లో శనివారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్‌ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి చేయగా.. అనంతరం కె.వేణుగోపాల్‌ ప్రసంగించారు. దేశంలోని రాజకీయాలు మతపర అంశాలనే ఎజెండా చేసుకుని సున్నిత భావావేశాలను ప్రజల్లో రగిలించి ఓట్లు దండుకుంటున్న పరిస్థితిని కండ్లెదుటే చేస్తున్నామని చెప్పారు. ప్రజల అవసరాలు, క్షేమాన్ని గాలికొదిలేసి ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థల జపం చేస్తున్న తీరూ కనిపిస్తోందన్నారు.
ఇప్పుడున్న స్థితిలో ఉద్యమిస్తేనే హక్కుల పరిరక్షణ
దేశవ్యాప్తంగా ఈ యూనియన్‌ సభ్యత్వం కింద లక్షా 10వేల మంది ఉండగా.. రాష్ట్రంలో ఆ సంఖ్య 5వేలు దాటిందని, యూనియన్‌ ఏర్పడిన తొలినాళ్లలో పదుల సంఖ్యలో జరుపుకునే సమావేశాలు ఇప్పుడు వందల సంఖ్యతో నడుపుకుంటున్నా రని చెప్పారు. ఒక్క పిలుపు ఇస్తే వేలాది మంది కార్మికులు సమ్మెకు దిగి యాజమాన్యాల మెడలు వంచుతూ హక్కులను సాధించుకుంటూ వచ్చామని వివరించారు. ఇప్పుడు ఆ హక్కులను పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందన్నారు. కేంద్ర సర్కారు 40కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా కుదించి అధికారికంగానే పని గంటలను పెంచుకుంటూ పోతోందన్నారు. అందులో భాగంగానే కర్ణాటకలో 12గంటల పనిదినాలను ప్రకటించిన అక్కడి సర్కారుపై ట్రేడ్‌యూనియన్లు తిరగబడటంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందేనన్నారు. మరోవైపు ఢిల్లీ కేంద్రంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడిన పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లోని యూనియన్‌ ఆ ఉద్యమానికి విరాళాలు సేకరించిందనే సాకుతో ఏకంగా వారి గుర్తింపు రద్దు చేసిన దుర్మార్గపు చర్య చూసిందేనన్నారు. ఇప్పుడు ప్రశ్నించినా, ఎదురుతిరిగినా ఏదో ఒక నెపాన్ని ఆయా సంఘాలు, యూనియన్లపై మోపుతూ దోషులుగా చిత్రీకరిస్తున్న దుర్మార్గపు పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని పాలకుల పనితనాన్ని, పాలిటిక్స్‌ను బట్టబయలు చేస్తున్న న్యూస్‌క్లిక్‌ సంస్థపై ఈడీ దాడులు చేయించి, అందులో విదేశీ విరాళాలు ఉన్నాయని ఓ ఇంటర్నేషనల్‌ పత్రికలో రాయించి.. రెండేండ్ల తరువాత సంస్థ యాజమాన్యాన్ని కేంద్ర సర్కారు జైల్లో పెట్టిందన్నారు. అందుకే పాలకుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సంఘాన్ని మరింత సంఘటి తంగా బలపరుచుకుంటూ ఉద్యమిస్తేనే తమ హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుం దని చెప్పారు.
మొదటి రోజు మహాసభ కు టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ అధ్యక్షు లు భానుకిరణ్‌ అధ్యక్షత వహించ గా.. యూనియన్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ ఐ.రాజుభట్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ రిప్రజెంటేటీవ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు కె.రమేష్‌ సుందర్‌, ఐఎంఏ కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్‌ ప్రసంగించారు. సభలో ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఐ సహాయ ప్రధాన కార్యదర్శి కె.సునిల్‌కుమార్‌, టీఎమ్‌ఎస్‌ఆర్‌యు సహాయ కార్యదర్శి నాగేశ్వర్‌రావు, కోశాధికారి దుర్గాప్రసాద్‌, కార్యదర్శులు శ్రీధర్‌, సదానంద చారి, ఐలయ్య, సయ్యద్‌ సిద్దిక్‌, మహాసభల ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎం.అంజయ్య సహా యూనియన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.
నగరంలోని డాక్టర్స్‌ స్ట్రీట్‌లో భారీ ర్యాలీ
తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌ మహాసభ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా నుంచి డాక్టర ్‌స్ట్రీట్స్‌ గుండా భారీ ర్యాలీ తీశారు. యూనియన్‌ జెండాలతో ప్రతినిధులు సాగించిన ర్యాలీలో మందుల ధరలు తగ్గించాలని, వైద్యపరికరాలు, మందులపై జీఎస్టీ ఎత్తేయాలనే డిమాండ్‌ వినిపించారు. ప్రారంభ సభకు ముందు యూనియన్‌ జెండా ఆవిష్కరించారు. సభాస్థలికి కామ్రేడ్‌ బాసుదేబ్‌ ఆచార్యనగర్‌ గానూ, సభా వేదికను కామ్రేడ్‌ హెచ్‌.ఎస్‌ శ్యాల్‌గా నామకరణం చేసు కున్నారు.