– బతుకమ్మ పండగ మనకే ప్రత్యేకం..
– తెలంగాణ తల్లి నుంచి దూరం చేయడం బాధాకరం
– 9 మంది కవులు, కళాకారుల్లో ఆడబిడ్డలకు స్థానమేది? : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ అస్తిత్వానికి, వారసత్వానికి, భావోద్వేగాలకు ప్రతిరూపమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక జీవోతో మార్చలేరని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ప్రపంచంలో బతుకమ్మ పండగ మనకే ప్రత్యేకమనీ, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేయడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం గుర్తించిన 9 మంది కవులు, కళాకారుల్లో ఆడబిడ్డలకు స్థానమేది? సదాలక్ష్మి, బెల్లి లలిత, మాభూమి సంధ్య , చాకలి ఐలమ్మ, విమలక్క, పీవోడబ్ల్యూ సంధ్య ఎందుకు గుర్తుకు రాలేదు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి రూపం బీద తల్లి రూపమని సీఎం అంటున్నారు.. తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడూ కూలీనాలి చేసుకుంటూనే ఉండాలా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి చేతిలోని జొన్నలు, మక్కలు తెలంగాణకు ప్రతీకని ముఖ్యమంత్రి అంటున్నారనీ, అవి ఇతర రాష్ట్రాల్లో పండవా ? అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లోనూ అవి పండుతున్నప్పుడు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉన్నదని నిలదీశారు. బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేసి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే తెలంగాణ తల్లి అనడం చాలా దారుణమని విమర్శించారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు కాబట్టి ఇక మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వరా ? అని నిలదీశారు. సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. ఉద్యమకారులను అవమానించవద్దని సూచించారు. ఉద్యమకారులతో పెట్టుకున్నవారెవ్వరూ బాగుపడలేదనీ, ఈ విషయాన్ని మీ గురువైన చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని సూచించారు.
ఆశా వర్కర్లకిచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి
ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆశా వర్కర్లను గౌరవంగా ప్రగతిభవన్‌కు పిలిపించి మాట్లాడి వారి వేతనాలను పెంచారనీ, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆశా వర్కర్ల మీద దాష్టికం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. ఒకపక్క పేద తల్లి విగ్రహాన్ని పెట్టామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు ఆడబిడ్డలైన ఆశా వర్కర్ల మీద దాష్టీకాన్ని ప్రదర్శించారని అన్నారు.