– తొమ్మిదిమంది కేంద్రమంత్రుల కూడా..
– ఈ ఏడాదిలో ముగియనున్న పదవీకాలం
న్యూఢిల్లీ: ఈ ఏడాది రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీలు నిష్క్రమించనున్నారు. వీరిలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గరిష్టంగా పది సీట్లు ఖాళీ కానున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లలో కనీసం ఒక సీటు ఖాళీ కానున్నది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సుధాన్షు త్రివేది కలిపి 68 మంది నేతల పదవీకాలం ముగియనున్నది.
కేంద్రమంత్రులు వీరే…
పదవీకాలం ముగియనున్న 68 మంది ఎంపీల్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండ్యా ఉన్నారు. వీరి పదవీకాలం ఏప్రిల్‌లో పూర్తికానుంది.
యూపీలో గరిష్టస్థానాలకు ఎన్నికలు
ఉత్తరప్రదేశ్‌లో గరిష్టంగా 10 సీట్లు ఖాళీ అవుతాయి. దీని తర్వాత మహారాష్ట్ర, బీహార్‌లో ఆరు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో ఐదు, కర్నాటక, గుజరాత్‌లో నాలుగు, ఢిల్లీ, ఒడిశా, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో మూడు చొప్పున, జార్ఖండ్, రాజస్థాన్‌లో రెండేసి చొప్పున, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి ఖాళీగా ఉంటాయి.
ముగియనున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంజరు సింగ్ పదవీకాలం
ఢిల్లీలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ జైలు శిక్ష అనుభవిస్తున్న ఆప్ నేతలు సంజరు సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, సుశీల్ కుమార్ గుప్తాల పదవీకాలం జనవరి 27తో ముగియనుంది. సిక్కింలోని ఏకైక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డీఎఫ్) ఎంపీ హిషే లఛుంగ్పా ఫిబ్రవరి 23న పదవీ విరమణ చేయనున్నారు.
ప్రస్తుతం తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం కూడా ఈ ఏడాదితో ముగియనుంది. మళ్లీ ఎంపీ కావాలంటే, బీజేపీ అధ్యక్షుడు హిమాచల్ వెలుపల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ సంఖ్యాపరంగా వెనుకబడింది. 2023 మే నెలలో జరిగిన కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, 2023 డిసెంబర్‌లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ విజయాలతో, రెండు రాష్ట్రాలు తమ అభ్యర్థులను పార్లమెంటు ఎగువ సభకు పంపుతాయని పార్టీ కూడా ఆశిస్తోంది. కర్నాటకలో నలుగురు, తెలంగాణలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.
ముగియనున్న మన్మోహన్ సింగ్, అశ్విని వైష్ణవ్ పదవీకాలం
పదవీ విరమణ చేస్తున్న సభ్యుల్లో మన్మోహన్ సింగ్, భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్), అశ్విని వైష్ణవ్, బీజేడీ ఎంపీలు ప్రశాంత్ నందా, అమర్ పట్నాయక్ (ఒడిశా), బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలూని (ఉత్తరాఖండ్), మన్సుఖ్ మాండవ్య, మత్స్యశాఖ మంత్రి పుర్షోత్తం రూపాలా, గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ అమీ యాగ్న్‌తో పాటు నారన్‌భారు రాత్వా కూడా ఉన్నారు.
మహారాష్ట్రలో…
మహారాష్ట్ర నుంచి పదవీ విరమణ చేస్తున్న సభ్యులలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమ శాఖ మంత్రి నారాయణ్ రాణే, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, కాంగ్రెస్ సభ్యుడు కుమార్ కేత్కర్, ఎన్సీపీ సభ్యుడు వందనా చవాన్ , శివసేన (యూబీటీ) సభ్యుడు అనిల్ దేశారు ఉన్నారు. ఎన్సీపీ, శివసేన మధ్య రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల తర్వాత రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
మధ్యప్రదేశ్‌లో…
మధ్యప్రదేశ్ నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ సభ్యులు అజరు ప్రతాప్ సింగ్, కైలాష్ సోనీ, కాంగ్రెస్ ఎంపీ రాజమణి పటేల్ పార్లమెంటు ఎగువ సభ నుంచి పదవీ విరమణ చేయనున్నారు.
కర్నాటకలో…
కర్నాటకలో పదవీ విరమణ చేయనున్న సభ్యులలో బీజేపీకి చెందిన రాజీవ్ చంద్రశేఖర్ , కాంగ్రెస్ నుంచి ఎల్ హనుమంతయ్య, జిసి చంద్రశేఖర్ , సయ్యద్ నాసిర్ హుస్సేన్ ఉన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో…
పశ్చిమ బెంగాల్ నుంచి తణమూల్ కాంగ్రెస్ సభ్యులు అబిర్ రంజన్ బిస్వాస్, సుభాశిష్ చక్రవర్తి, మహ్మద్ నడిముల్ హక్ , శంతనుసేన్ ,కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి పార్లమెంటు ఎగువ సభ నుంచి పదవీ విరమణ చేస్తున్నారు.
బీహార్‌లో…
బీహార్‌లో ఆర్జేడీ సభ్యులు మనోజ్ కుమార్ ఝా, అహ్మద్ అష్ఫాక్ కరీం, జేడీయూ సభ్యులు అనిల్ ప్రసాద్ హెగ్డే, బశిష్ఠ నారాయణ్ సింగ్, బీజేపీ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ, కాంగ్రెస్ సభ్యుడు అఖిలేశ్ ప్రసాద్ సింగ్ రాజ్యసభ పదవీకాలం పూర్తికానున్నది. అలాగే బీజేపీ సభ్యులు అనిల్ అగర్వాల్, అశోక్ బాజ్‌పారు, అనిల్ జైన్, కాంత కర్దమ్, సకల్‌దీప్ రాజ్‌భర్, జీవీఎల్ నరసింహారావు, విజరు పాల్ సింగ్ తోమర్, సుధాంశు త్రివేది , హరనాథ్ సింగ్ యాదవ్ , ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు జయా బచ్చన్ పదవీ కాలం ముగియనున్నది.
ఆంధ్రప్రదేశ్‌లో…
ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైఎస్సార్సీపీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు.
ఛత్తీస్‌గఢ్, హర్యానా నుంచి బీజేపీ ఎంపీలు సరోజ్ పాండే, డీపీ వాట్స్ పదవీ విరమణ చేస్తున్నారు. జార్ఖండ్‌లో బీజేపీ ఎంపీ సమీర్ ఓరాన్, కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు మేలో పార్లమెంట్ ఎగువ సభ నుంచి పదవీ విరమణ చేస్తున్నారు.
కేరళలో…
కేరళలో సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం, సీపీఐ ఎంపీ బినోరు విశ్వం, కేసీ(ఎం) ఎంపీ జోస్ కె మణి జులైలో పదవీ విరమణ చేయనున్నారు. నలుగురు నామినేటెడ్ ఎంపీలు కూడా జులైలో పదవీ విరమణ చేయనున్నారు.వీరిలో బీజేపీకి చెందిన మహేశ్ జెఠ్మలానీ, సోనాల్ మాన్‌సింగ్, రామ్ షకల్, రాకేష్ సిన్హా ఉన్నారు.
తెలంగాణలో…
ఇక తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ ఎంపీలు జోగినిపల్లి సంతోష్ కుమార్, రవిచంద్ర వద్దిరాజు, బి లింగయ్య యాదవ్ పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అభ్యర్థుల్లో కనీసం ఇద్దరినీ రాజ్యసభకు పంపాలని భావిస్తోంది.