హస్తం వైపే ఎగ్జిట్‌పోల్స్‌

Exit polls towards Hastam– ఒకటెండ్రు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు కొన్నింటిలో హంగ్‌
–  కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి ఓటమి అంటూ ఆరా సంచలన ప్రకటన
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చేశాయి. కాంగ్రెస్‌ పార్టీవైపు మొగ్గుచూపాయి. మెజార్టీ సర్వే సంస్థలు అధికారం ‘హస్త’గతం కాబోతున్నదని ప్రకటించాయి. అధికార బీఆర్‌ఎస్‌ ఈసారి రెండో స్థానానికే పరిమితం కాబోతున్నట్టు స్పష్టం చేశాయి. మూడో స్థానం కోసం బీజేపీ-ఎంఐఎం పోటీపడుతున్నట్టు చెప్పాయి. ఒకటెండ్రు సర్వే సంస్థలు మాత్రం రాష్ట్రంలో వరుసగా మూడోసారీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతున్నదని చెప్పాయి. రాష్ట్రంలో హంగ్‌ రాబోతున్నదనీ, ప్రభుత్వ ఏర్పాటులో ఎంఐఎం, బీజేపీ కీలకపాత్ర పోషించబోతున్నాయని కూడా కొన్ని వెల్లడించాయి. ఇదిలా ఉండగా, కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఓడిపోతున్నారనీ, అక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలువబోతున్నారని ‘ఆరా’ సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. ఇప్పటిదాకా ఒకటెండ్రు సందర్భాల్లో మినహా ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు దాదాపు సక్సెస్‌ అవుతూ వస్తున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించిన సర్వే సంస్థలెన్ని చెబుతున్నప్పటికీ ఈవీఎంలలోనే అభ్యర్థుల భవితవ్యాలు దాగి ఉన్నాయి. కొత్తగా కొలువు దీరే ప్రభుత్వమేదనేది తెలుసుకోవాలంటే మూడో తేదీ దాకా ఎదురుచూడాల్సిందే.
‘ఆరా’..గుబులు పుట్టించేరా..
సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో గట్టిపోటీ ఎదుర్కొంటున్నప్పటికీ వారే విజయం సాధిస్తారని ఆరా సంస్థ వెల్లడించింది. అయితే, కామారెడ్డిలో మాత్రం వారిద్దరూ ఓడిపోతారంటూ బాంబ్‌ పేల్చేసింది. అక్కడ బీజేపీ వెంకటరమణారెడ్డి గెలవబోతున్నారంటూ సంచలన ప్రకటన చేసింది. కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మతంగా తీసుకున్న కామారెడ్డిలో ఓటమి అనే అంశం బీఆర్‌ఎస్‌లో గుబులు పుట్టిస్తున్నది. ఐదుగురు మంత్రులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారనీ, వారిలో పలువురు ఓడిపోనున్నారని చెప్పింది. కొల్లాపూర్‌లో పోటీచేసిన ఇండిపెండెంట్‌ అభ్యర్థి శిరీష(బర్రెలక్క)కు పదివేలకుపైగా ఓట్లు రాబోతున్నాయని వెల్లడించింది. ఈటల రాజేందర్‌ ఇటు గజ్వేల్‌లోనూ, అటు హుజురాబాద్‌లోనూ నెక్‌ టు నెక్‌ ఫైట్‌ ఎదుర్కొంటున్నారని ప్రకటించింది. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ గెలుస్తారనీ, హుజురాబాద్‌లో ఈటలకు 50-50 అవకాశాలున్నాయని చెప్పింది.