ఓటమితో నిష్క్రమణ

Exit with defeat– కోచి చేతిలో హైదరాబాద్‌ ఓటమి
– ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ 2024
చెన్నై : హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఏడో ఓటమి చవిచూసింది. ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ 2024 సీజన్‌ నుంచి ఓటమితో నిష్క్రమించింది. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో కోచి బ్లూ స్పైకర్స్‌ చేతిలో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ 0-3తో ఓటమి పాలైంది. వరుసగా మూడు గేమల్లో 12-15, 12-15, 11-15తో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ నిరాశపరిచింది. గ్రూప్‌ దశలో ఎనిమిది మ్యాచుల్లో ఒక్క విజయమే సాధించిన హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఓటమితో సీజన్‌ను ముగించింది. హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఆటగాళ్లలో సాహిల్‌ కుమార్‌ ఆరు పాయింట్లు సాధించగా, అషమత్‌ ఐదు, స్టెఫాన్‌ నాలుగు పాయింట్లు సాధించారు. కోచి బ్లూ స్పైకర్స్‌ నుంచి సెబాస్టియన్‌ 11 పాయింట్లు, కుమార్‌ ఆమన్‌ 10 పాయింట్లు, వసంత్‌ ఓమ్‌ 5 పాయింట్లతో మెరిశారు. సెబాస్టియన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఎనిమిది మ్యాచుల్లో ఒక్క విజయమే సాధించిన కోచి బ్లూ స్పైకర్స్‌ సైతం హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌తో పాటు సూపర్‌5 రేసు నుంచి నిష్క్రమించింది.