– మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభోత్సవం
హైదరాబాద్ : నగరంలో నూతనంగా విస్తరించిన మెడ్‌ట్రా నిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేష న్ సెంటర్‌ను ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు లాంచనంగా ప్రారంభించారు. అమెరికా వెలుపల మెడ్‌ట్రానిక్ అతిపెద్ద ఆర్‌అండ్‌డి సెంటర్‌గా నిలువనుందని మంత్రి అన్నారు. మెడ్‌టెక్ ఆవిష్కరణలకు హాట్‌స్పాట్‌గా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య పరికరాల తయారీ, ఆర్‌అండ్‌డి రెండింటికీ ఆదర్శవంతమైన గమ్యస్థానంగా హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపేందుకు కషి చేస్తుందన్నారు.
దాదాపు 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను హెల్త్‌కేర్ టెక్నాలజీ ఆర్‌అండ్‌డికి ఉపయోగించనున్నామని మెడ్‌ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసి) ఛైర్మన్, సిఇఒ జెఫ్ మార్తా అన్నారు. ఐదేళ్ల విస్తరణ ప్రణాళికల్లో భాగంగా రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామన్నారు. భవిష్యత్తులో 1500 మందికి ఉపాధి లభించ నుందన్నారు. ఈ ప్రారంభోత్సవంలో యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పాల్గొన్నారు.
ఫైనాన్సీయల్ డిస్ట్రిక్‌లో ఫోర్సీస్ సెంటర్ ఏర్పాటు
కాలిఫోర్నీయా కేంద్రంగా ఐటి కంపెనీ ఫోర్సీస్ ఐఎన్‌సి నగరంలోని ఫైనాన్సీయల్ డిస్ట్రీక్‌లో కొత్త ఆఫీసును తెరిచింది. 21వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను గురువారం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, హైదరాబాద్‌లోని యుఎస్ కన్స్యూలెట్ జనరల్ జెన్నీఫర్ లర్సన్‌తో కలిసి ప్రారంభించారు. రూ.16 కోట్ల (2మిలియన్ డాలర్ల)తో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఉద్యోగ కల్పన పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను అహ్వానిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో ఐల్యాబ్స్ గ్రూప్ ఛైర్మన్ శ్రీనివాస రాజు, స్టార్ హాస్పిటల్స్ ఎండి గోపి చంద్ మన్నమ్ తదితరులు పాల్గొన్నారు.