హైదరాబాద్‌లో జొయిటిస్‌ విస్తరణ

– ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం
– జంతు ఆరోగ్య సంరక్షణలో కొత్త ఆవిష్కరణలు
– అమెరికాలో సీఎంతో కంపెనీ ప్రతినిధుల భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జొయిటిస్‌ కంపెనీ హైదరాబాద్‌లో తమ వ్యాపార సెంటర్‌ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెప్టెంబర్‌ నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించ నున్నట్టు వెల్లడించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జొయిటిస్‌ ఇండియా కెేపబిలిటీ సెంటర్‌ను విస్తరించే నిర్ణయాన్ని ఈ సందర్భంగా సీఎం స్వాగతించారు. తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని వారికి సీఎం వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి లైఫ్‌ సైన్స్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయని చెప్పారు. ఫ్యూచరిస్టిక్‌ టెక్నాలజీలో జొయిటిస్‌ రంగ ప్రవేశం రాష్ట్రానికి మరింత గుర్తింపు తెస్తుందని వ్యాఖ్యానించారు. ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతమనీ, తమ కంపెనీ విస్తరణ జంతు ఆరోగ్యానికి సంబంధించి సరి కొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడుతుందని జోయిటిస్‌ కంపెనీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ కీత్‌ సర్‌బాగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభా వనరులను సద్వినియోగం చేసుకుంటామని ఆ కంపెనీ కేపబిలిటీ సెంటర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ రాఘవ్‌ పేర్కొన్నారు. కంపెనీ విస్తరణతో రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలతో పాటు జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు వస్తాయని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.