ఎన్నికలు అంటేనే డబ్బు. నేడు రాజకీయాల్లో గెలుపోటములను ఈ డబ్బే తీవ్ర ప్రభావం చేస్తోంది. ‘బ్యాలెట్ బాక్స్ నుంచి ప్రజా సేవకుడు ప్రజాప్రతినిధిగా వస్తాడని’ అంబేద్కర్ చెప్పిన మాటలు కాస్తా పక్కకు పోయి ‘డబ్బు సంచుల నుంచి ప్రజాప్రతినిధి వస్తాడు’ అనేది ప్రచారంలోకి వచ్చింది. గతంలో హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారు అన్నది ఊహకు అందని విషయం. ప్రస్తున్న ఎన్నికల్లో కూడా కొన్ని నియోజకవర్గాలు ఖరీదైనవిగా మారాయి. కోట్లల్లో ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ‘ఖరీదైన’ నియోజకవర్గాలపై కథనం.
– కొడంగల్, మహేశ్వరం, తాండూరు, శేరిలింగంపల్లిలో తీవ్ర పోటీ పార్టీ, అభ్యర్థి ఎవరైనా డబ్బే ప్రాధాన్యం
– కోెట్లు ఖర్చుపెట్టేందుకు వెనుకాడని నేతలు
– వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకూ ముడుపులు
– చేరికలు, ప్రచారాలకు భారీగా ఖర్చు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఆయా రాజకీయ పార్టీలు రూ.కోట్లు ఖర్చు చేయగల అభ్యర్థులను బరిలో దింపడంతో ఎన్నికలు చాలా ఖరీదైనవిగా మారాయి. ఒక్కో నియోజకవర్గంలో సుమారు రూ.100 కోట్లుకుపై మాటే ఖర్చు చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా అర్బన్ ప్రాంతమైన శేరిలిగంపల్లి, రాజేందర్‌నగర్, మహేశ్వరం, ఎల్‌బీనగర్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు కోట్లల్లో ఉండనుంది. డబ్బు ఎంత ఖర్చు అనేది కాదు.. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రచార కూలి నుంచి అగ్రనాయకత్వం వరకు ఎవరినీ వదలకుండా డబ్బులతో కొనుగోలు చేస్తున్నారు. కుల సంఘాలు మొదలుకుని, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతోనూ బేరసారాలు చేస్తున్నారు. అంగట్లో సరుకును కొనుగోలు చేసిన చందంగా వార్డు మెంబర్ల నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు రేటు కడుతున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారానికి పెరిగిన సాకేతికను ఉపయోగించుకుంటున్నారు. డిజిటల్ మొబైల్స్ ద్వారా ప్రచారం మొదలు, ఇంటింటికీ కరపత్రం పంపిణీ చేసేందుకు కూలి వరకు డబ్బులు పే చేయాల్సిందే. ఒక పార్టీ అభ్యర్థి ప్రచార కూలికి రూ.500 ఇస్తే.. మరో పార్టీ అభ్యర్థి రూ. వెయ్యి ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదు.
తగ్గేదేలే…!
ఎన్నికల ఖర్చులో తగ్గేదేలేదని అభ్యర్థులు పోటీ పడి మరీ డబ్బులు కుమ్మరిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు రూ.500 కోట్లు చేతులు మారనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థి రూ.200 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్టు ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నారు. ఇంటింటికీి పార్టీ గుర్తును, మ్యానిఫెస్టోను ప్రచారం చేసే వ్యక్తికి ఇక్కడ రోజుకు రూ. 1500 నుంచి 2000 వరకు ఖర్చు చేస్తున్నారు. రాజేందర్‌నగర్ నియోజవర్గంలో సైతం ఇదే తంతు కొనసాగుతోంది. ఇక్కడ ఎన్నికల బరిలో నిలిచిన వారుసైతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడంతో ఎన్నికల సైతం వ్యాపారం మూడ్‌లో కొనసాగనున్నాయి.
మహేశ్వరం నియోజకవర్గం అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతమైనప్పటికీ ఎన్నికల ఖర్చు అర్బన్ ప్రాంతాన్ని మించనుందని ఆయా పార్టీల శ్రేణులు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి సబితాఇంద్రారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ముగ్గురి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఎక్కడిక్కక్కడ లీడర్లను కొనుగోలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్‌రెడ్డి మధ్య ప్రచారంలో కాసుల వర్షం కురుస్తోంది. కొండగల్ నియోజకవర్గంలో టీపీసీసీ రేవంత్‌రెడ్డి గెలుపు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం కావడంతో అక్కడ కూడా డబ్బు ప్రభావం తీవ్రంగా ఉండనుంది. రేవంత్‌ను ఓడించేందుకు బీఆర్‌ఎస్ సైతం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక్కడ పోటాపోటీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు.
సన్నగిల్లుతున్న సామాన్యుడి ఆశలు..
ప్రస్తుతం ఎన్నికల ఖర్చును చూసిన సామాన్యుడు ప్రజాప్రతినిధి కావాలన్న ఆశలు అవిరి అవుతున్నాయి. ఎన్నికల్లో వ్యాపారవేత్తల రంగప్రవేశంతో ఓటు సరుకైంది. ఓటు అనే సరుకును కొనుగోలు చేసే శక్తి పెట్టుబడిదారులకు మాత్రమే సాధ్యమన్న పరిస్థితి నెలకొంది.