16 పాటలతో ప్రయోగం

16 పాటలతో ప్రయోగంహీరో శర్వానంద్‌ నటిస్తున్న తన 35వ మూవీ ‘మనమే’. ఈ చిత్రంలో కతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్‌లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ గ్రాండ్‌గా నిర్మించారు. ఈనెల 7న థియేటర్లలో గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘ఇది చాలా డిఫరెంట్‌ ఎమోషన్స్‌ ఉన్న కథ. కథ గురించి ఇప్పుడే ఎక్కువ రివీల్‌ చేయకూడదు. ఇంత డిఫరెంట్‌ ఫిల్మ్‌ని చేయడం ఇదే మొదటిసారి. ఇందులో 16 పాటలు ఉన్నాయి. స్కోరింగ్‌ మొదలు పెట్టినప్పుడు ఇన్ని పాటలు వస్తాయని మేము ఊహించలేదు. డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య చాలా స్మార్ట్‌. ఆయన సినిమాని అద్భుతంగా మలిచి మంచి మ్యూజిక్‌ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఫస్ట్‌ హాఫ్‌ కంపోజ్‌ చేసినప్పుడే దాదాపు పది పాటలు వరకూ వచ్చాయి. సెకండ్‌ హాఫ్‌కి మరో ఆరు పాటలు అవసరం అవుతాయని భావించాం. సినిమా కోసం16 పాటలు చేయడం నాకు ఇదే తొలిసారి.11 ప్రాపర్‌ సాంగ్‌ ట్రాక్స్‌. మరో ఐదు డిప్‌, బిట్‌ సాంగ్స్‌గా వస్తాయి. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్‌ రావడం గాడ్‌ బ్లెస్సింగ్స్‌గా భావిస్తాను. ‘ఖుషి, హారు నాన్న’ మ్యూజిక్‌ని ఆడియన్స్‌ చాలా గొప్పగా రిసీవ్‌ చేసుకున్నారు. ఇందులో నా కంప్లీట్‌ మ్యూజిక్‌ నాలెడ్జ్‌ని ఎక్స్‌ప్రెస్‌ చేయడానికి అవకాశం దక్కింది. ఇదొక మ్యూజికల్‌ ఫిల్మ్‌. ఇన్ని పాటలు చేయడం నాకూ ఒక ప్రయోగంలా అనిపించింది. ఇది ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. కథకు అనుగుణంగానే పాటలు వస్తాయి. సాంగ్స్‌ నెరేటివ్‌ని ఇంకా వండర్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తాయి. శర్వానంద్‌, కృతిశెట్టి పెర్ఫార్మెన్స్‌ అద్భుతంగా ఉంటుంది’ అని తెలిపారు.