– 12గంటల కల్లా తెలియచేయాలని సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ: నీట్-యుజి 2024 మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో వచ్చిన వివాదాస్పదమైన ప్రశ్నను సమీక్షించడం కోసం ముగ్గురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఐఐటి ఢిల్లీ డైరెక్టర్‌ను సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. ఆ ప్రశ్నకు సరైన సమాధానాలు చాలా వున్నాయని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్‌కు ఎన్‌టిఎ తెలియచేసింది. అందువల్లే, దీనికి పరిష్కారంగా కొంతమంది విద్యార్ధులకు గ్రేస్ మార్కలు కలపాలని ఎన్‌టిఎ నిర్ణయించింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న బెంచ్, మంగళవారం మధ్యాహ్నం 12గంటల కల్లా నిపుణుల కమిటీ ఏది సరైన సమాధానమో నిర్ణయించి, ఆ అభిప్రాయాన్ని తమ ముందుంచాల్సిందిగా ఆదేశించింది. నీట్ పరీక్ష నిర్వహణలో పేపర్ లీక్‌తో సహా అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ నమోదైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. కేందాలు, నగరాల వారీగా ఫలితాలను ప్రచురించాల్సిందిగా ఎన్‌టిఎను ఇంతకుముందు ఆదేశించింది. నీట్ డేటాను ఎన్‌టిఎ బహిరంగపరచగానే హర్యానాలోని రేవరిలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డిపిఎస్) సెంటర్ నుండి 264మంది అభ్యర్ధుల్లో 22శాతం మంది 600కి పైగా మార్కులను సాధించినట్లు వెల్లడైంది. అంటే పరీక్ష సందర్భంగా కాపీయింగ్ జరిగివుంటుందనే ఆరోపణలు తలెత్తాయి. పాట్నా, హజారీబాగ్‌ల్లో పేపర్ లీక్‌లు జరిగాయన్నది అంగీకరించిన వాస్తవమేనని ఈ రెండు కేసులను సిబిఐ దర్యాప్తు చేస్తోందని కోర్టు పేర్కొంది.