చెలరేగిన శ్రేయస్‌

చెలరేగిన శ్రేయస్‌– రాణించిన జితేశ్‌, యశస్వి
– భారత్‌ స్కోరు 160/6
శ్రేయస్‌ అయ్యర్‌ (53) జోరు కొనసాగించాడు. ప్రపంచకప్‌ ఫామ్‌ను పొట్టి ఫార్మాట్‌లోనూ చూపించాడు. చిన్నస్వామిలో అయ్యర్‌ అర్థ సెంచరీతో కదం తొక్కటంతో ఆతిథ్య భారత్‌ తొలుత 160 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (21), జితేశ్‌ శర్మ (24), అక్షర్‌ పటేల్‌ (31) సైతం ఆకట్టుకునే ఇన్నింగ్స్‌లు ఆడారు. చిన్నస్వామి స్టేడియంలో ఏడు టీ20ల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు ఒకసారే గెలుపు గీత దాటింది.
నవతెలంగాణ-బెంగళూర్‌
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద ఆశిస్తే.. భారత్‌, ఆసీస్‌ టీ20కి స్లో పిచ్‌ సిద్ధమైంది. అయినా, టీమ్‌ ఇండియా బ్యాటర్లు వదల్లేదు. ఆరంభంలో యశస్వి జైస్వాల్‌ (21, 15 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) ధనాధన్‌ దంచికొట్టగా.. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ (53, 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. అక్షర్‌ పటేల్‌ (31, 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), జితేశ్‌ శర్మ (24, 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) కదం తొక్కారు. కీలక బ్యాటర్లు విఫలమైనా కఠిన స్లో పిచ్‌పై టీమ్‌ ఇండియా తొలుత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బెహన్‌డార్ఫ్‌, బెన్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
అయ్యర్‌ అదుర్స్‌ : పరుగుల విందుకు బెంగళూర్‌ చిరునామా. టీ20 సిరీస్‌కు భారీ స్కోర్ల థ్రిల్లర్‌తో ముగింపు ఖాయమే అనిపించింది. కానీ అనూహ్యంగా స్లో పిచ్‌ ఎదురవటంతో అభిమానులకు నిరాశ తప్పలేదు. సిరీస్‌లో నిలకడగా చెలరేగిన కెప్టెన్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ (5), రింకూ సింగ్‌ (6), రుతురాజ్‌ గైక్వాడ్‌ (10)లు ఆరంభంలోనే వికెట్‌ కోల్పోయారు. దీంతో భారత్‌ మంచి స్కోరు సాధిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ స్థితిలో శ్రేయస్‌ అయ్యర్‌ (53) అర్థ సెంచరీతో ఆదుకున్నాడు. క్రీజులో నిలిచిన అయ్యర్‌.. మరో ఎండ్‌లో జితేశ్‌ శర్మ (24), అక్షర్‌ పటేల్‌ (31) తోడుగా అదరగొట్టాడు. వికెట్లు పడినా.. టీమ్‌ ఇండియా ఎదురుదాడిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. జితేశ్‌ శర్మ, అక్షర్‌ పటేల్‌ సహజ శైలిలో మెప్పించారు. జితేశ్‌ మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదగా.. అక్షర్‌ రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిశాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 36 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన అయ్యర్‌ చివరి ఓవర్లో నిష్క్రమించాడు. అయ్యర్‌ ధాటికి చివరి నాలుగు ఓవర్లలో భారత్‌ 45 పరుగులు పిండుకుంది. దీంతో 55/4 నుంచి కోలుకుని 160 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలుత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (21) ఎదురులేని ఆరంభం అందించాడు. రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో పవర్‌ప్లేలో విరుచుకుపడ్డాడు. కానీ జైస్వాల్‌ ఎప్పటిలాగే ఎంతోసేపు వికెట్‌ కాపాడుకోలేదు. అతడి నిష్క్రమణతో భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయ్యర్‌, జితేశ్‌, అక్షర్‌ రాణించటంతో మ్యాచ్‌ రేసులో నిలిచే స్కోరు చేయగల్గింది.
స్కోరు వివరాలు :
భారత్‌ ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (సి) ఎలిస్‌ (బి) బెహాన్‌డార్ఫ్‌ 21, రుతురాజ్‌ గైక్వాడ్‌ (సి) బెహాన్‌డార్ఫ్‌ (బి) బెన్‌ 10, శ్రేయస్‌ అయ్యర్‌ (బి) ఎలిస్‌ 53, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) మెక్‌డెర్మాట్‌ (బి) బెన్‌ 5, రింకూ సింగ్‌ (సి) డెవిడ్‌ (బి) సంగా 24, జితేశ్‌ శర్మ (సి) షార్ట్‌ (బి) హార్డీ 24, అక్షర్‌ పటేల్‌ (సి) హార్డీ (బి) బెహన్‌డార్ఫ్‌ 31, రవి బిష్ణోరు (రనౌట్‌) 2, అర్షదీప్‌ సింగ్‌ నాటౌట్‌ 2, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 160.
వికెట్ల పతనం : 1-33, 2-33, 3-46, 4-55, 5-97, 6-143, 7-156, 8-160.
బౌలింగ్‌ : అరోన్‌ హార్డీ 4-0-21-2, బెహన్‌డార్ఫ్‌ 4-0-38-2, బెన్‌ 4-0-30-2, నాథన్‌ ఎలిస్‌ 4-0-42-1, తన్వీర్‌ సంగా 4-0-26-1.