వామపక్ష రాజకీయాలతోనే దోపిడీ రహిత సమాజం

With leftist politics Exploitation free society– పెట్టుబడిదారుల కోసమే బూర్జువా రాజకీయాలు
– సరళీకృత ఆర్థిక విధానాలతో అసమానతలు
– అభివృద్ధి, ఆస్తులు సంపన్నులకే పరిమితం
– పేదలు మరింత పేదలవుతున్న దుస్థితి: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
– వామపక్ష భావజాలం బలపడాలి : చెరుపల్లి సీతారాములు
– సంగారెడ్డిలో సీపీఐ(ఎం) రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా.. ”వామపక్ష రాజకీయాలు- నేటి అవసరం”పై సెమినార్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
”బూర్జువా రాజకీయాలంటే పెట్టుబడిదారీ రాజకీయాలు. వామపక్ష రాజకీయాలంటే కార్మికులు, శ్రామికులు, కష్టజీవులు, దోపిడీకి గురయ్యే ప్రజల రాజకీయాలు. దేశంలో శ్రమ దోపిడీ, కుల, మత పీడన లేని సమాజం.. కేవలం ఒక్క వామపక్ష రాజకీయాల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది” అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. జనవరి 25-28 తేదీల్లో సంగారెడ్డిలో జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా శుక్రవారం స్థానిక గోకుల్‌ ఫంక్షన్‌ హాల్‌లో ”వామపక్ష రాజకీయాలు- నేటి అవసరం” అనే ఆంశంపై నిర్వహించిన సెమినార్‌కు బీవీ రాఘవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసమాన తలతో కూడిన భారతదేశంలో కనీస వేతనాల కోసం కార్మికులు, గిట్టుబాటు ధరల కోసం రైతులు, చేసేందుకు పని, ఉండేందుకు ఇండ్ల కోసం పేదలు చేసే పోరాటాలకు వామపక్షాలు మాత్రమే అండగా నిలుస్తున్నాయన్నారు. దోపిడీకి గురయ్యే కష్టజీవుల న్యాయమైన సమస్యల్ని పరిష్కరించడానికి ఇష్టపడని బూర్జువా పార్టీలన్నీ కూడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు, లాభాల కోసమే పని చేస్తున్నాయని తెలిపారు. వామపక్షాలు అధికారంలోకి వచ్చిన దేశాల్లో, రాష్ట్రాల్లో ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకున్న విషయాలను గుర్తు చేశారు. తమిళనాడులో సాంసంగ్‌ కంపెనీలో కార్మికులు చేసిన సమ్మెకు వామపక్షాలు తప్ప బూర్జువా, పాలక పార్టీలేవీ మద్దతుగా ఉండలేదని తెలిపారు. బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు నిరసనగా రైతులు ఏడాది పాటు సాగించిన పోరాటాన్ని బీజేపీ, కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ పార్టీలు పట్టించుకోకపోగా నిర్బంధాన్ని ప్రయోగించేందుకు దోహదపడ్డాయన్నారు. ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నెలకొల్పుతున్నామని ప్రధాని మోడీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో జరిగే అభివృద్ధి, పెరిగే సంపద ఎవరికి దక్కుతుందనే విషయాన్ని పరిశీలించాలన్నారు. ఒక్క శాతంగా ఉన్న పెట్టుబడిదారుల చేతుల్లో 56 శాతం ఆస్తులున్నాయని, 98 శాతంగా ఉన్న ప్రజల వద్ద కేవలం ఒక్క శాతమే మిగిలిందన్నారు. అంబానీ, అదానీ ఆస్తులు వందల రెట్లు పెరిగిపోతుండగా, సామాన్యుల్లో మాత్రం కొనుగోలు శక్తి తగ్గిపోయిందని చెప్పారు. సరళీకృత ఆర్థిక విధానాల్ని కాంగ్రెస్‌ అమలు చేస్తే బీజేపీ వాటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నదని విమర్శించారు. దాని ఫలితంగానే దేశంలో విద్య, వైద్యం, రైల్వేలు, విద్యుత్‌, మంచినీటి సరఫరా వంటి మౌలిక రంగాల్ని ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయన్నారు. దాంతో దేశంలో అసమానతలు మరింత పెరిగాయని తెలిపారు. శ్రమను గౌరవించడం, మహిళల్ని సమానంగా గౌరవించడం, హక్కులు, అవకాశాలు కల్పించడం వామపక్ష రాజకీయాల ప్రధాన ఉద్దేశమని స్పష్టంచేశారు. బూర్జువా రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా వామపక్ష రాజకీయాలు బలపడేందుకు అసంతృప్తిగా ఉన్న ప్రజల్ని సమీకరించి మరింత సమరశీలంగా ఉద్యమాలు నిర్వహించేందుకు సీపీఐ(ఎం) కృషి చేస్తోందన్నారు. సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర మహాసభలో ఆ దిశగా కర్తవ్యాలను రూపొందిస్తామని తెలిపారు.
వామపక్ష బావజాలం బలపడాలి: చెరుపల్లి సీతారాములు
దేశంలో, రాష్ట్రంలో వామపక్ష బావజాలం మరింత బలపడాల్సిన అవసరముందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. ప్రజల కోసం పనిచేస్తూ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వామపక్షాలను బూర్జువా శక్తులు బలహీన పర్చేందుకు కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. పార్టీలు మారుస్తూ అధికారం చెలాయించిన వాళ్లెవ్వరూ ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కలిగిన సంగారెడ్డి గడ్డపై జరిగే సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభల్లో వామపక్ష రాజకీయాలు బలపడేందుకు దోహదపడే చర్చలు, నిర్ణయాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఆహ్వాన సంఘం చైర్మెన్‌ చుక్క రాములు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ, బాబురావు, ఎం.అడివయ్య, సీనియర్‌ నాయకులు బొంతల చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, రాష్ట్ర నాయకులు జె.మల్లిఖార్జున్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మల్లేశం, కె.రాజయ్య, ఎ.మాణిక్‌, జి.సాయిలు, ఎం.నర్సింహులు, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.