పత్తి మార్కెట్‌లో దోపిడీని అరికట్టాలి

– తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పత్తి మార్కెట్లలో దోపిడీని అరికట్టి, కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలనీ, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా క్వింటాలుకు రూ.475 బోనస్‌ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌, టి సాగర్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని మార్కెట్లలో పత్తి ధరలను క్వింటాలుకు రూ.6000-7000కు తగ్గించి మధ్య దళారులు విపరీతంగా లాభాలు సంపాదిస్తున్నారని తెలిపారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయించాలని గుర్తు చేశారు.
ప్రస్తుతం కనీస మద్దతు ధర రూ.7,521 ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను బట్టి అమ్మకాలు జరగాలని తెలిపారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర కొనసాగుతుందని పేర్కొన్నారు. అయినా రాష్ట్రంలోని వ్యాపారులు మిలాఖత్‌ అయ్యి పత్తి ధరను రూ.6000- 7000కు తగ్గించారని తెలిపారు. నాణ్యత ప్రమాణాల పేరుతో రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 43 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారని పేర్కొన్నారు. అధిక వర్షాల వల్ల ఐదు లక్షల ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. రెండుసార్లు వేసిన పంట మరింత దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఎకరాకు 3-5 క్వింటాళ్ల లోపు మాత్రమే పత్తి దిగుబడి వస్తున్నదని తెలిపారు. ఎకరానికి రూ 70 వేల పెట్టుబడి పెట్టినా..రూ. 40 వేలకు మించి ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు బోనస్‌ కలిపి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీసీఐ కొనుగోలు చేస్తే అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను చూస్తే ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. ధరలు తగ్గిస్తే అప్పులపాలై ఆత్మహత్యలు మరింత పెరుగుతాయని గుర్తు చేశారు. ఇప్పటికే ఏటా దేశంలో 12వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, ఇందులో పత్తి, కౌలు రైతులే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. ఇలాంటి స్థితిలో పత్తి రైతులకు మద్దతు ధర అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే రైతాంగాన్ని కదిలించి ఆందోళన, పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.