వేతనాలు పెంచకుండా.. శ్రమ దోపిడీ

– వేతనాలు పెంచకుంటే.. కార్మిక శక్తి ఏంటో చూపిస్తం
– వలస కార్మికులతో వెట్టి చేయిస్తున్న యాజమాన్యాలు : సంగారెడ్డి జీపుజాతాలో భూపాల్‌, మల్లిఖార్జున్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
కార్మికులకు వేతనాలు పెంచకుండా కంపెనీల యాజమాన్యాలు శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, మల్లికార్జున్‌ అన్నారు. షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్‌లో కనీస వేతనాలను సవరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రాష్ట్రవ్యాప్త జీపుజాతా గురువారం సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడల్లో పర్యటించింది. కంది, సంగారెడ్డి, హత్నూర, కొండాపూర్‌, సదాశివపేట, జహీరాబాద్‌లోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్ని కలిసి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. వలస కార్మికుల్ని కలిసి అదనపు పని గంటలు, తక్కువ వేతనాలు, నివాస ప్రాంతంలో కనీస సదుపాయాల లేమీ వంటి ఆంశాల గురించి మాట్లాడారు. అనంతరం సాయంత్రం సంగారెడ్డిలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేండ్లుగా కనీస వేతనాలు సవరించాలని అనేక రూపాల్లో పోరాటాలు చేసినప్పటికీ వేతనాల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడంలేదని విమర్శించారు.
80 శాతం మంది హిందీ ప్రాంతం నుంచి వలసొచ్చిన కార్మికులున్నారని, వీరందరితో తక్కువ వేతనాలతోనే 12 గంటల పాటు పనిచేయించుకుంటున్నారన్నారు. నివాస ప్రాంతాల్లో బానిసల్ని పెట్టినట్టు పెట్టి పనిచేయించుకోవడం దారుణమన్నారు. సంగారెడ్డి జిల్లాలో 1375 భారీ, మధ్యతరహా పరిశ్రమలున్నాయని, వీటిల్లో లక్షా 80 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వీరిలో కేవలం 60 వేల మంది మాత్రమే యూనియన్ల పోరాటం వల్ల పర్మినెంట్‌ కార్మికులుగా పనిచేస్తున్నారని తెలిపారు.
మిగతా లక్షా 20 వేల మంది కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నారని, వీరికి తక్కువ వేతనాలిచ్చి 12 గంటల పాటు పనిచేయిస్తూ శ్రమను దోచుకుంటున్నారని విమర్శించారు. లక్షల కోట్ల విలువ చేసే భూముల్ని ధారాదత్తం చేస్తున్న పాలకులు శ్రమ శక్తితో సంపదను సృష్టిస్తున్న కార్మికులకు వేతనాలు పెంచడానికి ఎందుకు మనసొప్పట్లేదని ప్రశ్నించారు. వేతనాలు పెంచకపోవడమంటే శ్రమను దోచుకోవడమేన న్నారు. కనీస వేతనాల సమస్య అనేది వర్గ పోరాటమని, కనీస వేతనాలను సవరించే వరకూ సీఐటీయూ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. శ్రమదోపిడికి వ్యతిరేకంగా సమరశీలంగా ఉద్యమించి, కార్మిక శక్తి ఏమిటో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చూపిస్తామని హెచ్చరించారు. సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బీ.మల్లేశం, జిల్లా కార్యదర్శి జి.సాయిలు, ఉపాధ్యక్షులు బాగారెడ్డి, సహాయ కార్యదర్శి యాదగిరి, నాయకులు ప్రసన్న, బాలరాజు, కొండల్‌రెడ్డి, ప్రవీణ్‌, శ్రీధర్‌, నాగభూషణం, జెమినా పాల్గొన్నారు.