ఆఫ్ఘన్‌ మంత్రి అంత్యక్రియల్లో పేలుడు

– 11మంది మృతి
ఫైజాబాద్‌: ఆఫ్ఘన్‌ మంత్రి అంత్యక్రియల సమయంలో సంభవించిన పేలుడులో 11మంది మరణించగా, 30మంది గాయపడ్డారని హోం శాఖ తెలిపింది. ఆఫ్ఘన్‌ తాత్కాలిక ప్రావిన్షియల్‌ గవర్నర్‌ నిసార్‌ అహ్మద్‌ అహ్మది ఈ వారం ప్రారంభంలో ఆత్మాహుతి దళం జరిపిన దాడిలో మరణించారు. బదక్‌షాన్‌ ప్రావిన్స్‌ రాజధాని ఫైజాబాద్‌లో అహ్మది అంత్యక్రియల సమయంలో పేలుడు సంభవించింది. కాగా ఈ చర్యను హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. 2021 ఆగస్టులో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘన్‌లో భద్రత మెరుగుపడింది కానీ ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు ముప్పు మాత్రం మిగిలే వుంది. కాగా అహ్మది హత్యకు తమదే బాధ్యత అని ఐఎస్‌ ప్రకటించింది. పేలుడు పదార్ధాలతో నిండిన కారును ఆయన వాహనంపైకి పోనివ్వడంతో అహ్మదితో పాటు కారు డ్రైవర్‌ కూడా చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. అహ్మది అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైన సమయంలో గురువారం పేలుడు సంభవించింది.