న్యూఢిల్లీ : దేశరాజధాని న్యూఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. అయితే పేలుడు పదార్థాన్ని ఇంకా గుర్తించలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. అయితే రాయబార కార్యాలయం వెనుక వైపు ఉన్న తోటలో ఇజ్రాయిల్ రాయబారిని ఉద్దేశిస్తూ ఒక లేఖ లభ్యమయిందని, ఈ లేఖ యొక్క ప్రామాణికతను తనిఖీ చేస్తున్నామని చెప్పారు. పేలుడు సమాచారం తెలిసిన తక్షణమే చాణక్యపురి ప్రాంతంలోని రాయబార కార్యలయం వద్దకు పోలీసు బలగాలు చేరుకున్నాయి. తనిఖీలు ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఈ పేలుడు జరిగిందని రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు. అలాగే, ఈ విషయంపై ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. తమ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని, ఈ కేసును దర్యాప్తు చేసేందుకు భారత అధికారులకు సహకరిస్తున్నామని తెలిపింది.