పేట్రేగిన మతోన్మాదులు

పేట్రేగిన మతోన్మాదులు– ఐదు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు
– ప్రాణ ప్రతిష్ట తర్వాత అల్లరి మూకల విధ్వంసకాండ
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్‌,మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో మతపరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని  చోట్ల అల్లరిమూకలు చెలరేగిపోయి భయోత్పాతాన్ని సృష్టించారు. హింసకు తెగబడ్డారు. మతోన్మాదులు రెచ్చిపోయి మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేశారు. అయోధ్యలో కార్యక్రమం ముగిసిన తర్వాత వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ సంస్థలకు అనుబంధంగా ఉన్న గ్రూపులు విజయగర్వంతో పెట్రేగిపోయాయి. దీంతో అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైనారిటీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.
న్యూఢిల్లీ :
దుండగులు మతపరమైన నినాదాలు కూడా చేశారని, మసీదులోని వారిని బెదిరించారని జహీరుద్దీన్‌ చెప్పారు. వారు ఇతర మతాలకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని అన్నారు. నగరంలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేసే ఉద్దేశంతోనే దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా మసీదులో బీభత్సం సృష్టించిన వారిపై ఐపీసీలోని 147, 148, 452, 505 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్‌ చేశామని, మిగిలిన వారి కోసం గాలింపు జరుగుతోందని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. విచారణ కొనసాగుతోందని, అరెస్టయిన వారికి ఏ సంస్థతోనూ సంబంధం లేదని ఆయన చెప్పారు. ఆగ్రాలోని దివాన్‌జీ బేగం సమాధి, మసీదు… ఈ రెండూ పురావస్తు శాఖ స్మారక కట్టడాల జాబితాలో ఉన్నాయి. ఈ మసీదును 1677లో నిర్మించారు. అయితే ఇప్పుడు అక్కడ దివాజ్‌జీ బేగం సమాధి ఆనవాళ్లు కన్పించడం లేదు. పునాది గోడ మాత్రమే ఉంది. బీహార్‌లోని దర్భాంగా జిల్లా ఖిర్మా గ్రామంలో ముస్లింలకు సంబంధించిన స్మశానవాటికలోకి అల్లరిమూకలు ప్రవేశించి దానికి నిప్పంటించారు. ఢిల్లీలోని జైత్‌పూర్‌ ప్రాంతంలో దుండగులు అభ్యంతరకరమైన నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు నివసించే కాలనీలో విధ్వంసం సృష్టించారు. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరగడానికి ఒక రోజు ముందు మధ్యప్రదేశ్‌లోని జబువా జిల్లాలో కొందరు వ్యక్తులు ఓ చర్చి పైకి ఎక్కి కాషాయ జెండాను ఎగరేశారు. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్న ప్రార్థనల అనంతరం పాతిక మంది వ్యక్తులు హఠాత్తుగా చర్చిలోకి ప్రవేశించి బిగ్గరగా నినాదాలు చేశారు. అనంతరం పైకి ఎక్కి కాషాయ పతాకాన్ని ఎగరేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు.
ముంబయిలోని మిరా రోడ్డులో జరిగిన హింసాకాండలో ఇప్పటి వరకూ 13 మందిని అరెస్ట్‌ చేశారు. మిరా రోడ్డు, పాన్వెల్‌, నాగపూర్‌ సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మతపరమైన ఘటనలు జరిగాయని వార్తలు అందాయి. అల్లరిమూకలు వీధుల్లో తిరుగుతూ నినాదాలు చేయడం, పోస్టర్లను చించేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. గుజరాత్‌లోని మెసానా జిల్లాలో నిర్వహించిన శోభాయాత్ర ర్యాలీ హింసకు దారితీసింది. ర్యాలీలో పాల్గొన్న వారు రాళ్లు రువ్వారు. చెవులు చిల్లులు పడేలా డీజే సంగీతం వినిపిస్తూ, బాణసంచా కాల్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కనీసం మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు సాయంత్రం మహారాష్ట్రలోని మిరా రోడ్డులో హింసాత్మక ఘటనలు జరిగాయి. నయా నగర్‌, భయందర్‌లో కూడా హింస చెలరేగినట్లు వార్తలు వచ్చాయి. ఘర్షణలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్మాత్మక ప్రాంతాల్లో ఉగ్రవాద నిరోధక దళానికి చెందిన కమాండోలను మోహరించారు. ఈ నెల 21, 22 తేదీల్లో పాన్వెల్‌లో కూడా కొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయి. ముంబయిలో హిందూత్వ గ్రూపులు నిర్వహించిన ఓ ర్యాలీలో ముస్లిం వ్యక్తి చేత బలవంతంగా జై శ్రీరామ్‌ అనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ సంస్థలకు చెందిన 200-250 మంది ఓ మసీదు పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో గుమిగూడారు. అక్కడ హనుమాన్‌ దేవాలయాన్ని నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ పూజలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. హత్నూర్‌ మండలంలోని దౌలతాబాద్‌ నుండి ర్యాలీ తీసిన హిందూత్వ వాదులు ఓ ముస్లిం వ్యాపారి దుకాణానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆగ్రా మసీదుపై కాషాయ జెండాలు
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి చేసిన వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మతోన్మాదులు వీరంగం సృష్టించారు. శోభాయాత్ర నిర్వహిస్తూ మొఘలుల కాలం నాటి పురాతన మసీదుపై కాషాయ జెండాలు ఎగరేసి నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ తాజ్‌గంజ్‌ పోలీసులు 11 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో 1,000-1,500 మంది వ్యక్తులు లాఠీలు, కర్రలు పట్టుకొని బలవంతంగా మసీదులోకి ప్రవేశించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దివాన్‌జీ కీ బేగం షాహీ మసీదు సంరక్షకుడు జహీరుద్దీన్‌ తెలిపారు. వారంతా మసీదులో గందరగోళం సృష్టించారని, మినార్లు, గోడల పైన, మసీదు ప్రాంగణంలో కాషాయ జెండాలు ఎగరేశారని ఆయన వివరించారు.