పొడిగింపా.. ప్రత్యేక పాలనా?

సర్పంచుల పదవీ కాలం చివరి తేదీ ఫిబ్రవరి రెండో తేదీ. సర్పంచుల పదవీ కాలం పొడిగించాలా? గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనతో ముందుకెళ్లాలా?– సర్పంచుల పదవీకాలంపై ఎటూ తేల్చని రాష్ట్ర సర్కారు
– గతంలో మూడుసార్లు పొడిగింపు
– చెక్‌పవర్‌, కరోనా ఇబ్బందుల రీత్యా ఏడాది పొడిగించాలంటున్న సర్పంచులు
– ఎలాంటి గైడ్‌లైన్స్‌ రాలేదు: ఉన్నతాధికారులు..
సర్పంచుల పదవీ కాలం చివరి తేదీ ఫిబ్రవరి రెండో తేదీ. సర్పంచుల పదవీ కాలం పొడిగించాలా? గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనతో ముందుకెళ్లాలా? అనే అంశంపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. గడువు వారం రోజులే ఉన్నా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాల్లో సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించిన సందర్భాలున్నాయనీ, తమ పాలననూ పొడిగించాలని ప్రస్తుత సర్పంచులు డిమాండ్‌ చేస్తున్నారు. చెక్‌పవర్‌, కరోనా కాలం ఇబ్బందుల రీత్యా అనేక సమస్యలు ఎదుర్కొన్నామని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రస్తుత సర్పంచులు 2019 ఫిబ్రవరి రెండో తేదీన ప్రమాణస్వీకారం చేశారు. వారి ఐదేండ్ల పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి రెండో తేదీతో ముగియనున్నది. వాస్తవానికి గడువులోగా సర్పంచి ఎన్నికలను నిర్వహించాలి. అసెంబ్లీ ఎన్నికలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల హడావిడి నేపథ్యంలో ప్రస్తుతం సర్పంచి ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర సర్కారు సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలోనే సర్పంచుల పదవీ కాలం పొడిగింపు, ప్రత్యేక అధికారుల పాలన అనే అంశాలు తెరపైకి వచ్చాయి. తాము బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల వరకు చెక్‌ పవర్‌ ఇవ్వలేదనీ, ఆ తర్వాత కూడా ఉపసర్పంచితో కలిపి జాయింట్‌ చెక్‌పవర్‌ ఇవ్వడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా మని సర్పంచులు ప్రస్తావిస్తున్నారు. కరోనా కాలంలో ఎవ్వరూ ముందుకు రాకున్నా ముందుండి గ్రామాల్లో పారిశుధ్య పనులు, ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు, శానిటేషన్‌ పనులను దగ్గరుండి చేయించామని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీలకు జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకురావడంలో సర్పంచుల పాత్ర మరువలేనిది. 90 శాతానికిపైగా గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో రాకపోయినా తమ చేతుల నుంచి డబ్బులు పెట్టుకుని పనులు చేశారు. సరైన సమయంలో నిధులు అందక, ముందుగా ఖర్చు చేసిన పనులకు ఇంకా బిల్లులు రాక, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన నిధులు అందక ప్రస్తుత సర్పంచులు నిస్సహాయ స్థితిలోకి నెట్టబడ్డారు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఏడాదిగానీ, లేనిపక్షంలో ఎన్నికలు నిర్వహించే వరకైనా తమ పదవీ కాలాన్ని పెంచాలని సర్పంచులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే అధికారిక విధులతో సతమతం అవుతున్న ఎంపీడీఓలు, పంచాయతీరాజ్‌ అధికారులు, గ్రామ కార్యదర్శులకు ఇన్‌చార్జి పాలన అప్పగిస్తే గ్రామాల అభివృద్ధి కుంటుపడుతున్నదనే విషయాన్ని సర్పంచులు ఎత్తిచూపుతున్నారు. రానున్న వేసవిలో గ్రామాల్లో తాగునీటి, డ్రెయినేజీ సమస్యలు కూడా తీవ్రతరం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే తమ పదవీ కాలాన్ని పెంచాలని సర్పంచులు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
గతంలో పెంపు ఇలా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు సర్పంచుల పదవీ కాలం ముగిసాక వారిని పర్సన్‌ ఇన్‌చార్జులుగా నియమించారు. 1981 నుంచి 1986 వరకు సర్పంచుల పదవీ కాలం ముగిశాక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ ప్రభుత్వం ఏడాది 9 నెలల 19 రోజుల సమయాన్ని పొడిగించింది. 1988లో ఎన్నికలు నిర్వహించారు. ఆ సర్పంచుల పదవీ కాలం ముగిశాక కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్పంచుల పదవీ కాలాన్ని 2 సంవత్సరాల 6 నెలల 22 రోజుల పాటు పొడిగించింది. వారిని పర్సన్‌ ఇన్‌చార్జులుగా కొనసాగించింది. 1995లో ఎన్నికలు నిర్వహించారు. ఆ సర్పంచులు 21 అక్టోబర్‌ 2000 వరకు పదవీ కాలంలో ఉన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా సర్పంచ్‌ ఎన్నికలను జరుపలేదు. ఆ సమయంలో సర్పంచులను ఇన్‌చార్జులుగా 10 నెలల రెండు రోజుల పాటు నియమించారు. అయితే, ఆ సందర్భాల్లో సర్పంచులకు పూర్తిగా చెక్‌పవర్‌ మాత్రం ఇవ్వలేదు. ఎంపీడీఓ, గ్రామకార్యదర్శి పర్యవేక్షణలో వారి పాలన సాగింది. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ తొలి ప్రభుత్వ హయాంలోనూ సర్పంచుల ఎన్నికలను గడువులోగా నిర్వహించలేదు. ఆ సందర్భంలో ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించారు.
గూడూరు లక్ష్మినర్సింహారెడ్డి తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో క్లిష్టమైన పరిస్థితుల్లో గ్రామాలలో పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కుంటుపడుతుందని భావించి మూడు పర్యాయాలు సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ పర్సన్‌ ఇన్‌చార్జులుగా నియమించారు. ”మార్పు కావాలి” అనే నినాదంతో ముందుకు వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాటు తమ పదవీ కాలాన్ని పెంచాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ద్వారా వినమ్రంగా విన్నవిస్తున్నాం. కరోనా కష్టకాలంలోనూ ప్రాణాలొడ్డి పనిచేశాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తాము అప్పులు చేసి చేసిన అభివృద్ధి పనులతో రాష్ట్రంలోని పల్లెలు, తండాలు, గ్రామాలు ఎంతో పురోగతి సాధించాయి. ఇప్పటికీ ఇంకా చేసిన పనులకు బిల్లులు పెండింగులో ఉన్నాయి. విపత్కరమైన పరిస్థితులలో పనిచేసి,సరైన సమయంలో ప్రోత్సహకాలు అందక విలువైన సమయాన్ని కోల్పోయాం. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన పెట్టి గ్రామీణ వ్యవస్థను దెబ్బతీయొద్దని కోరుతున్నాం.