– అదనపు కలెక్టర్ శ్రీనివాస్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
కేంద్ర ప్రభుత్వం గత ఖరీఫ్, రబికి సంబంధించి సీఎంఆర్ చెల్లించే తేదీని అక్టోబర్ 31 వరకు పొడిగించినందున మిల్లర్లు ఈనెలాఖరు నాటికి సీఎంఆర్ ను చెల్లించాలని అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం ఆయన తన చాంబర్లో రైస్ మిల్లర్లతో సీఎంఆర్, దాన్యం కొనుగోలు సేకరణపై మిల్లర్లతో సమీక్షించారు. గత ఖరీఫ్ కి సంబంధించి ఇంకా 12000మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదేవిధంగా రబికి సంబంధించి 72000 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ను మిల్లర్లు చెల్లించాల్సి ఉందని, ఇందుకుగాను ఈనెల ఆఖరు లోపు సి ఎం ఆర్ చెల్లించాలని అన్నారు. ఒకవేళ చెల్లించనట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డిప్యూటీ తహసిల్దారులు ప్రతిరోజు మిల్లుల నుండి సీఎంఆర్ డెలివరీ అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు.ఈ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రారంభమైనందున రైస్ మిల్లర్లు తక్షణమే మిల్లులకు కేటాయించాల్సిన జాబితాను సమర్పించాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ధాన్యాన్ని తీసుకోవాలని ఆయన కోరారు.జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీష్, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు, మిల్లర్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.