– ఈ నెల 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ఈ నెల 31 వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 కోట్ల పెండింగ్ చలాన్లుండగా గత నెల 26 నుంచి జనవరి 10 వరకు 1.29 కోట్ల చలాన్ల ద్వారా రూ.113 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 37.50 లక్షల చలాన్ల ద్వారా రూ.28.70 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 21.25 లక్షల చలాన్లకుగాను రూ.23.65 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16.60 లక్షల చలాన్లకు గాను రూ. 13.35 లక్షల ఆదాయం వచ్చింది. గతేడాది కూడా రాయితీపై పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు పోలీస్ శాఖ వాహనదారులకు అవకాశమివ్వడంతో 45 రోజుల్లోనే ఏకంగా రూ.300కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సారీ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి భారీగా స్పందన రావడంతో గడువును మరోసారి పొడిగించినట్టు సర్కార్ తెలిపింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వాహనదారులకు విజ్ఞప్తి చేసింది.