నవతెలంగాణ-ఆసిఫాబాద్
మూడు రోజులుగా పులి ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో సంచరిస్తుండడంతో అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మండలంలోని చిర్రకుంట గ్రామంలో సెక్షన్ అధికారులు సాయి, మహేందర్ గ్రామంలో డప్పు చాటింపు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మంగళవారం చిర్రకుంట సమీపంలోని ఎర్రగుట్ట మీద ఆవుపై దాడి చేసి దానిని చంపి వేసిందన్నారు. ప్రస్తుతం పులి ఆ ప్రాంతంలో సంచరిస్తుందని మేకల కాపరులు అటువైపు వెళ్లకూడదన్నారు. ఆ ప్రాంతంలో పంట పొలాలను కలిగి ఉన్నవారు పనులు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అటవీశాఖ అధికారులకు సహకరించాలని కోరారు. పులి జాడలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో బీట్ అధికారి వెంకటేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.