– భారీగా పట్టుబడుతున్న నగదు
– మద్యం, విలువైన వస్తువులు
– హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రూ.2.24కోట్లు సీజ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశాలతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.2.24కోట్లను స్వాధీనం చేసుకున్నారు. గత శనివారం వరకు జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు రూ.1,73,60,800ను సీజ్ చేయగా, రూ.23,61,964 విలువైన ఇతర వస్తువులు, 314.45 లీటర్ల అక్రమ మద్యంను పట్టుకున్నారు. సోమవారం రూ.4,60,000 సీజ్ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్, జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. రూ.4,60,000, రూ. 3,06,193 విలువ గల వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా రూ.3,45,000 సీజ్ చేయగా, పోలీస్‌ల ద్వారా రూ.1,15,000 పట్టుకున్నారు. నగదు, ఇతర వస్తువుల రవాణాపై 22 ఫిర్యాదులు రావడంతో అధికారులు వాటిని పరిశీలించారు. 20 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇక 360.90 లీటర్ల మద్యాన్ని పట్టుకున్న పోలీసులు, 20 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎన్నికల నిబంధనలను ఎవరు అతిక్రమించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ హెచ్చరించారు. ఇదిలావుండగా, ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.2 కోట్ల 24 లక్షల 81 వేల 800, 32 లక్షల 91 వేల 571 రూపాయల విలువైన వివిధ వస్తువులు,1045.065 లీటర్ల మద్యం పట్టుబడింది. 61 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.