ఫీజుల దోపిడీ

Extortion of fees– ప్రయివేటు మెడికల్‌ కాలేజీల ఆగడాలు అరికట్టాలి
– తెలంగాణ రాష్ట్ర వైద్యవిద్యార్థుల పేరెంట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణలో ప్రయివేటు వైద్య కళాశాలల ధనదాహానికి కళ్లెం వేయాలని తెలంగాణ వైద్యవిద్యార్థుల పేరెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు డి.రవి ప్రసాద్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.చంద్రశేఖర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రయివేటు మెడికల్‌ కాలేజీలు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ ఇష్టానుసారంగా ఫీజుల పేరుతో తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా బి కేటగిరీలో సీట్లు పొందిన విద్యార్థులను ఆయా కళాశాలలు ఇబ్బంది పెడుతున్నాయని మండిపడ్డారు. మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ పొందిన మేనేజ్‌ మెంట్‌ కోటా విద్యార్థులను ఫీజుల పేరిట ప్రయివేటు మెడికల్‌ కాలేజీలు వేధిస్తున్నాయని విమర్శించారు.
మొదటి సంవత్సరం ఫీజులు కట్టించుకున్న సదరు కళాశాలలు రెండో సంవత్సరానికి బ్యాంకు గ్యారంటీ తీసుకున్నాయని తెలిపారు. అయితే ప్రస్తుతం పలు కాలేజీలు రెండో సంవత్సరానికి ఫీజు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తూ మానసిక వేధనకు గురి చేస్తున్నారు. కాళోజీ విశ్వవిద్యాలయం నిబంధనల ప్రకారం విద్యాసంవత్సరంతో సంబంధం లేకుండా తమకు ఫీజులు చెల్లించాలనీ, లేకుంటే మొదటి సంవత్సరం పరీక్షలకు అనుమతించబోమంటూ సెల్‌ మెసేజ్‌ లను తల్లిదండ్రులకు పంపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని వందలాది మంది మధ్యతరగతి వర్గాలు తీవ్ర అవస్థలకు లోనవుతూ వ్యయప్రయాసలకు గురవుతున్నాయని వారు తెలిపారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వైద్యవిద్య అభివృద్ధి ద్వారా ఎంతో మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశాన్ని కల్పిస్తుంటే మరోవైపు ప్రయివేటు వైద్య కళాశాలలు ఫీజుల పేరిట విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నాయని చెప్పారు. వెంటనే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు జోక్యం చేసుకుని ప్రయివేటు మెడికల్‌ కాలేజీల ఫీజుల విషయంలో చేస్తున్న ఆగడాలకు, అవకతవకలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్యవిద్యార్థుల పేరెంట్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. వైద్యారోగ్యశాఖ మంత్రిగా హరీశ్‌ రావు రాష్ట్రంలో వైద్యవిద్య అభివృద్ధికి నూతన కళాశాలల ఏర్పాటు ద్వారా ఎంతో మంది పేద మధ్య తరగతి వర్గాలు వైద్యులు అయ్యే అవకాశం కల్పిస్తూ వారి జీవితాలకు బంగారు బాటలు వేస్తున్నారని కొనియాడారు. ఈ విషయమై విద్యార్థుల పక్షానా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించింది. ఇప్పటికైనా ఫీజుల విషయంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు ప్రయివేటు వైద్య కళాశాలలను నియంత్రించే విధంగా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని కోరారు.