అదనపు దూ(భా)రం…

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీతో వాహనదారులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. సాధారణ సమయం కంటే వానలు పడినప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ‘మహాచక్ర బంధంలో మహానగరం’, ‘రెండు కిలో మీటర్లు.. రెండుగంటలు’ అనే హెడ్డిం గ్స్‌తో పత్రికల్లోనూ వస్తుంటాయి. ట్రాఫిక్‌ పోలీసులు కూడా ఎండనకా, వాననకా శ్రమించి ట్రాఫిక్‌ను నియంత్రి స్తుంటారు. వారికి అభినందనలు. అయితే రోజురోజుకూ వాహనాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రా’ఫికర్‌’కు చెక్‌ పెట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఓ చిట్కా కనిపెట్టారు. అదే ‘యూటర్న్‌’ ఇది బాగానే అనిపించినా వాహన దారుల పై ఆర్థిక భారం పడుతున్నది. యూటర్న్‌ తో జంక్షన్ల వద్ద మలుపులు లేకుండా కిలోమీటర్‌ దూరంగా వెళ్లి వాహనాన్ని తిప్పుకుని రావాల్సి వస్తున్నది. ఒక్కోసారి రెండు కిలో మీటర్లు కూడా అవసరం లేకున్నా ప్రయాణించాల్సి వస్తున్నది. దీంతో పోలీసులకు పని తప్పుతుంది, కానీ మన పెట్రోల్‌ మాత్రం ఆవిరైపో తున్నది. యూటర్న్‌ ఉందనే కారణంగా పోలీసుల పర్యవేక్షణ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఆ దారి గుండా అమాత్యులు పోయినప్పుడో, భారీగా వానలు పడి పైనుంచి సెంటింగ్స్‌ పడినప్పుడో తప్ప ట్రాఫిక్‌ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. నిబంధనల పేరుతో చలాన్లు వేయడంలో పెట్టిన శ్రద్ధ ట్రాఫిక్‌ను నియంత్రించడం లేదనే విమర్శలు కూడా కోకొల్లలు. ట్రాఫిక్‌ వ్యవస్థ ఇలా ఉంటే ఎన్ని బ్రిడ్జ్‌లు నిర్మిం చినా, ఎన్ని రోడ్లు వెడల్పు చేసినా, ఎన్ని వన్‌వేలు పెట్టినా ట్రాఫిక్‌ పద్మ వ్యూహం లో చిక్కుకోక తప్పదు. వాహన దారుడు బాధలు అనుభవిం చకా తప్పదు!
– గుడిగ రఘు