– సెస్ యాక్టు సవరణతో కార్మిక సంక్షేమ నిధికి గండి
– సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు
నవతెలంగాణ – మట్టెవాడ
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక చర్యలతో అన్ని రంగాల కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ మంగళవారం వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట వద్ద రామ సురేందర్ భవన్‌లో గౌరవ అధ్యక్షులు వంగూరి రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సాయబాబు మాట్లాడుతూ.. 1979 అంతఆష్ట్ర వలస కార్మికుల చట్టం, 1996 భవన నిర్మాణ కార్మికుల సమగ్ర కేంద్ర చట్టాన్ని రక్షించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు. సెస్ యాక్ట్‌ను 2020లో సవరణ చేయటం వల్ల కార్మిక సంక్షేమ నిధికి గండి పడిందన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా లబ్ది పొందుతున్న భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టిందన్నారు. ఫిబ్రవరి 16న ఆల్ ట్రేడ్ యూనియన్స్ చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ భాగస్వామ్యం అవుతుందని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 54 రకాల భవన నిర్మాణ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని, దీనివల్ల కార్మిక హక్కులు హరించబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గద్దె దించడానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని, ఫిబ్రవరి 16న సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే, 2023లో ఫెడరేషన్ తీసుకున్న కర్తవ్యాల అమలుపై వివరించారు. చేపట్టిన కార్యక్రమాలపై వివిధ జిల్లాల ప్రతినిధులు చర్చలు జరిపి నివేదికను ఆమోదించారు. ఈ వర్క్‌షాప్‌లో ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముదాం శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి ఎలుక సోమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.లక్ష్మయ్య, బి.శ్రీనివాసులు, వి.గాలయ్య, టి.ఉప్పలయ్య, గార కోటేశ్వరరావు, జె.వెంకన్న, రాష్ట్ర సహాయ కార్యదర్శిలు అనంతగిరి రవి, సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి ముక్కర రామస్వామి, నారాయణ, కె.జంగయ్య, గొరిగి సోములు, యు.నరసింహారావు, ఎడ్ల రమేష్, ఎస్.రేణుక, తదితరులు పాల్గొన్నారు.