కంటివెలుగును కంటిన్యూ చేయాలి

కంటివెలుగును కంటిన్యూ చేయాలి– ఎమ్మెల్సీ ప్రభాకర్‌ రావు
– గ్లూకోమా వారోత్సవాలు షురూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నిర్వహించిన కంటి వెలుగు లాంటి ప్రయోజనకర కార్యక్రమాలను కొనసాగించాలని ఎమ్మెల్సీ ఎం.ఎస్‌. ప్రభాకర్‌ రావు సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో గ్లూకోమా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణలో సరోజినీ దేవి కంటి ఆస్పత్రి కీలక పాత్ర పోషిస్తున్నదని అభినందించారు. కంటికి సంబంధించిన వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అవగాహన పెంచుకోవాలని కోరారు. గ్లూకోమా కేసులు పెరుగుతున్నాయనీ, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా వాటి నుంచి బయటపడాలని సూచించారు. ఈ సందర్బంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వి.రాజలింగం నేతృత్వంలో వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్‌ ఆఫీసర్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్ల కార్డులు, బ్యానర్లు చేతబూని కరపత్రాలను పంచుతూ ప్రజల్లో అవగాహన కల్పించారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించే పని కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యవిద్య సంచాలకురాలు డాక్టర్‌ వాణి, ఆస్పత్రి వివిధ విభాగాల అధిపతులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రతిమ తదితరులు పాల్గొన్నారు.